Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్ వీక్‌ కావడంతో ఎక్కువగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయించాలని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయారు. అందుకే సీరియస్ టాస్కులు కాకుండా కంటెస్టెంట్స్‌కు కేవలం ఫన్నీ టాస్కులు మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ సీరియస్ టాస్కులు ఇచ్చినా కూడా కంటెస్టెంట్స్ వాటిని ఫన్నీ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లో అమర్‌దీప్‌కు జ్యోతిష్యుడి క్యారెక్టర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ క్యారెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేసే క్రమంలో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు అమర్. దానికి సంబంధించిన ఫన్నీ ప్రోమో విడుదలయ్యింది.


జ్యోతిష్యుడిగా అమర్‌దీప్..
‘‘ఈరోజు బిగ్ బాస్ ఇంట్లో జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యుడిగా అమర్‌దీప్ వ్యవహరిస్తూ.. ఇంటిసభ్యుల జ్యోతిష్యాన్ని ఒకరి తర్వాత ఒకరికి చెప్పవలసి ఉంటుంది’’ అని బిగ్ బాస్ సందేశాన్ని పంపించారు. దీంతో అమర్‌దీప్ ఫుల్‌గా జ్యోతిష్యుడి గెటప్‌లో రెడీ అయ్యాడు. యాస్ కూడా మార్చాడు. ముందుగా ప్రశాంత్‌ జాతకం చెప్తానంటూ పిలిచాడు. దండం పెట్టుకొని కూర్చోమన్నాడు. ప్రశాంత్ చేయి చూసి అమ్మో చాలా పెద్దది అని అన్నాడు. అంత పెద్దదా? అని శివాజీ అడగగానే చాలా అని సమాధానమిచ్చాడు అమర్. ‘‘ప్రశాంత్ ఇది చూసినట్లయితే.. పొలం దగ్గర నీకు ఒక తాబేలు దొరికింది. ఆ తాబేలుతో నీకు బాగా కలిసొచ్చింది’’ అని చెప్పాడు. 


బిత్తిరి చూపులు..
ప్రశాంత్ తర్వాత యావర్ జాతకం చెప్పించుకోవడానికి వచ్చాడు. అమర్ దగ్గరకు వచ్చి దండం పెట్టి కూర్చున్నాడు. ‘‘బిగ్ బాస్ హౌజ్‌లో మొదటిగా బిత్తిరి చూపులు చూసుకుంటే.. బిత్తిరి బిత్తిరిగా హౌజ్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. బెడ్ రూమ్‌లోకి వచ్చి బెడ్ మీద పడుకోవద్దు అన్న పాపానికి ఒక పెద్దావిడను బయటికి పంపించావు’’ అంటూ యావర్ వల్ల షకీలా ఎలిమినేట్ అయిన విషయాన్ని గుర్తుచేశాడు అమర్. దానికి సమాధానంగా ‘‘దేవుడు రాశారు స్వామి’’ అన్నాడు యావర్. ‘‘ఆయన రాశారు. నువ్వు పాటించావు’’ అని అమర్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘నీ భవిష్యత్తు, నీ జాతకం చూస్తే మనిషి మంచోడివే’’ అని అమర్ చెప్తుంగానే.. శివాజీ పక్కన కూర్చొని జోకులు వేశాడు. అది వింటూనే యావర్‌కు జాతకం చెప్పడం కంటిన్యూ చేశాడు. ‘‘నువ్వు ఇంప్రెస్ అయిన ప్రతీ మనిషి ఎక్స్‌ప్రెస్ చేయని విధంగా బయటికి వెళ్లిపోయారు అయ్యా’’ అని అన్నాడు.


మీ జాతకం బయటపడిపోతుంది..
ఆ తర్వాత అర్జున్.. జాతకం చెప్పించుకోవడానికి వచ్చాడు. అమర్ ఏం చెప్పకముందే ‘‘జాగ్రత్తగా చూసి చెప్పండి స్వామి’’ అని హెచ్చరించాడు. ‘‘లేకపోతే మీ జాతకం బయట పడిపోతుంది’’ అని పక్కనే ఉన్న ప్రశాంత్.. అమర్‌కు కౌంటర్ ఇచ్చాడు. ‘‘నా జాతకంలో ఏం లేదు’’ అని అమర్ అనగానే.. ‘‘అనగనగనగా ఒక కారు. కారులో పార, పార కింద చీర’’ అని చెప్పడం మొదలుపెట్టాడు అర్జున్. తనను చెప్పొద్దని ఆపబోయాడు అమర్. దీంతో కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. అమర్‌ను జ్యోతిష్యుడిగా సెలక్ట్ చేసి బిగ్ బాస్ మంచి పని చేశారని, ఇలా అయితే తనపై జోకులు వేయడానికి కంటెస్టెంట్స్‌కు మంచి అవకాశం దొరికిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మొత్తంగా జ్యోతిష్యం టాస్క్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు కంటెస్టెంట్స్.



Also Read: కొరియా షోలో చిరంజీవి ‘గోలిమార్’ సాంగ్ - తెలుగులో ఇరగదీసిన కొరియన్ సింగర్స్