బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 6’ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ‘స్టార్ మా’ సంస్థ మంగళవారం ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమో అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ షో ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇక ‘బిగ్ బాస్-6’ ప్రోమో విషయానికి వస్తే.. పెళ్ళికూతురు అప్పగింతలు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవ్వుతున్నారు. "మా ఇంటి మహాలక్ష్మిని పంపించడం నా వల్ల కావడం లేదమ్మా’’ అని తండ్రి ఏడుస్తుంటే.. ‘‘మిమ్మల్ని వదిలి వెళ్ళడం నా వల్ల కావడం లేదు నాన్న మీరు కూడా నాతో రండి" అని పెళ్లి కూతురు ఏడుస్తుంది. అప్పుడే తల్లి ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఇంకేముంది పెళ్లి కొడుకుతో సహా అంతా మాయమైపోతారు. 


అప్పుడే కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చేస్తారు. “అప్పగింతలు అయ్యేవరకు కూడా ఆగలేకపోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్లే” అని నాగ్ చెబుతారు. పెళ్ళికొడుకుతో సహా అందరూ టీవీకి అతుక్కుపోతారు. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే. ‘బిగ్ బాస్’ సీజన్ 6 ఎంటర్‌టైన్మెంట్‌కు అడ్డా ఫిక్స్” అని నాగ్ చెప్పే డైలాగ్ తో ప్రోమో ముగుస్తుంది.


మళ్ళీ నాగార్జునే హోస్ట్


‘బిగ్ బాస్’ సీజన్ 6కి కూడా కింగ్ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సీజన్ 3, 4, 5, ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా చేశారు. తాజాగా 6వ సీజన్‌కు సమంతని తీసుకొనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని కొట్టిపడేస్తూ నాగ్ అదిరిపోయే ఎంట్రీతో గతంలో ప్రోమో వదిలారు. కొద్ది రోజుల కిందటే ‘బిగ్ బాస్’ సీజన్ 6 కి సంబంధించిన లోగోని ‘స్టార్ మా’ రిలీజ్ చేసింది.


అన్ని భాషల్లో ‘బిగ్ బాస్’ షో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఓ ఏడాది ఓటీటీ వెర్షన్ లో కూడా ప్రసారం అయింది. కానీ పెద్దగా ఆశించిన ఫలితం రాలేదు. తాజాగా ఆరో సీజన్ మొదలు కానుంది.


సెప్టెంబర్ నుంచి ఈ షోని ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే టాక్ ని బట్టి మరో పది రోజులు పొడిగించే అవకాశం ఉంది. 17 లేదా 18 మంది కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశం ఉంది. గతంలో కామన్ మ్యాన్ కి అవకాశం దక్కింది. తర్వాత ఆ కాన్సెప్ట్ ని తీసేశారు. మళ్ళీ దాన్ని తీసుకురాబోతున్నారు.


బిగ్ బాస్ 6 సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంతమంది వివరాలతో ఉన్న లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యాంకర్ వర్షిణి, నటి నవ్యా స్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్, ఆదిలను షో నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. దాదాపు వీరిని ఫైనల్ చేసినట్లు సమాచారం. అలానే బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించనున్నారు. యాంకర్ శివ, మిత్రాశర్మ, అనిల్ రాథోడ్ లాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించే ఛాన్స్ ఉంది. ఇక ఇంట్లోకి ఎవరు అడుగుపెడతారో చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.