మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్ తనకు ఎప్పటి నుంచో తెలుసన్న బాలయ్య, తామంతా కలిసి భోజనం చేసేవారిమని అన్నారు. అప్పట్లో కారవాన్‌లు లేవని, చాప, దిండు వేసుకుని నేలపైనే పడుకునేవాళ్లమన్నారు. ఆ సమయంలో విగ్గు తీసేవాణ్ని అని వెల్లడించారు. మొన్న ఎవడో అన్నాడు వెధవ, విగ్గు పెట్టుకుంటాడు అని ఎగతాళిగా మాట్లాడాడని మండిపడ్డారు. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా ? మనదంతా ఓపెన్ బుక్, ఎవరికీ భయపడేదే లేదని హెచ్చరించారు.
పవర్ ప్యాక్ సినిమా
అనిల్ రావిపూడి విభిన్న చిత్రాలు తెరకెక్కిస్తుంటారని, సినిమా సినిమాకూ సంబంధం ఉండదన్నారు బాలయ్య. ఇండస్ట్రీకి ఆయన ఓ వరం అని అన్నారు. గెటప్, యాస తదితర అంశాల్లో రీసెర్చ్ చేశామన్న బాలకృష్ణ, పోటీ ఉంటేనే ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు వస్తాయని స్పష్టంచేశారు. మాకు మేమే పోటీ అని, నాకు ఎవరూ పోటీ కాదని, ఎవరినీ పట్టించుకోనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భగవంత్ కేసరి ప్రెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడారు. దేవాలయంలో మనం చేసే ప్రదక్షిణలు, దైవ నామస్మరణ 108తో ముడిపడి ఉంటాయన్న బాలకృష్ణ, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తన 108వ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. దుర్గ అంటే స్త్రీ శక్తి అని అన్న బాలయ్య, ఈ సినిమా పవర్‌తో కూడుకున్నదని వెల్లడించారు.
అది పూర్వజన్మ సుకృతం
సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, అఖండ, ఇలా గుర్తుండిపోయే పాత్రలు చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని వెల్లడించారు. భగవంత్ కేసరి పాత్ర కూడా గుర్తుండిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో చాలా ఉందన్న బాలయ్య, దాన్ని దాచిపెట్టామన్నారు. భగవంత్ కేసరి సినిమా చాలా కూల్‌గా మొదలవుతుందని, తర్వాత దబిడి దిబిడేనన్నారు. ప్రేక్షకులందరినీ సినిమాలోకి తీసుకెళ్ళిపోతుందని తెలిపారు. సినిమాతో పాటు ఇందులో పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తన సినిమా ఇంట్లో కూర్చుని చూస్తే ఆనదని, థియేటర్లలో పెద్ద స్క్రీన్‌పై చూస్తేనే కిక్ వస్తుందని తెలిపారు. అలాగే తాము ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువ అని, ఇంకా సినిమాలో మరో గెటప్ కూడా ఉందని చెప్పారు. అనిల్ రావిపూడితో మళ్లీ పని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ‘లియో’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఈ సినిమా పోటీ పడనున్నాయి.
కాజల్ ఇండస్ట్రీని ఏలింది
తమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందన్న బాలయ్య, స్టార్ హీరోయిన్ గా కాజల్ ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీని ఏలిందన్నారు. వివాహానంతరం కాస్త విరామం తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చిందన్నారు. ఈ సినిమాలోని కాత్యాయని పాత్రలో నటించేందుకు అంగీకరించిన ఆమెకు టీమ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలీల గొప్ప నటి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో మేమిద్దరం గ్లిజరిన్ లేకుండా నటించామన్నారు. ప్రతి ఒక్కరూ కంటతడితోనే థియేటర్ నుంచి బయటకు వస్తారని అన్నారు. ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు నిల్చొని చప్పట్లు కొట్టాల్సిందేనన్నారు.