ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సినిమాలలో  'అవతార్ 2' ఒకటి. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. 2009లో వచ్చిన  'అవతార్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. మళ్ళీ దాదాపు 13 ఏళ్ల తర్వాత 'అవతార్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తో మూవీపై అంచనాలు పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. 'అవతార్' సినిమాతో ప్రేక్షకుల్ని పండోరా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్.. ఇప్పుడు మళ్ళీ 'అవతార్ 2' లో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లి మరో ఊహా లోకాన్ని సరికొత్తగా పరిచయం చేయనున్నాడు. సముద్రంపై అవతార్స్ చేస్తున్న విన్యాసాలు, అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో కళ్లుచెదిరేలా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.


ఈ విజువల్ వండర్ లో  ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా బ్యాలెన్స్ గా చూపించారు జేమ్స్ కామెరూన్. ఈసారి యుద్ధం నీటి అడుగున జరుగుతుంది. సముద్రంలో నీటి అడుగున జరిగే సన్నివేశాలు కళ్ళు మిరుమిట్లుగొలిపే విధంగా ఉన్నాయి. దర్శకుడు ప్రేక్షకులను మరోసారి పండోరా ప్రపంచం లోకి తీసుకెళ్లాడనే చెప్పాలి. పండోరా గ్రహం చుట్టూ తిరిగే ఈ కథకు ఈసారి సముద్రాన్ని జోడించారు. 


మరోసారి 'అవతార్ 2' సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి 'అవతార్ 2' ను  తెరకెక్కించాడు దర్శకుడు. మూవీ లో  యాక్షన్ సీక్వెన్సులు కళ్లుచెదిరే రేంజ్ లో ఉంటాయనే విషయాన్ని తాజా ట్రైలర్ తో స్పష్టం చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోవడంతో ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 


'అవతార్ 2' ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న 120 భాషల్లో విడుదల కాబోతుండగా మన ఇండియాలో 7 భాషల్లో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాను సాధారణ స్క్రీన్స్ పై కంటే త్రీడీ, 4 డీఎక్స్ లో చూసేందుకు ఎక్కువమంది ప్రేక్షకులు ఆసక్తిచూపిస్తున్నారు. ఆ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఇప్పట్నుంచే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టారు. అనుకున్నట్టుగా జరిగితే సినిమా మొదటి రోజే 30 నుంచి 40 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. హిట్ టాక్ తెచ్చుకుంటే మొదటి వారంలో 100 కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాల మాట. అందుకే తెలుగు రైట్స్ కోసం డిస్టిబ్యూటర్లు ఎంత రేటుకైనా కొనడానికి సిద్ధమవుతున్నారట. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి అంటే డిసెంబర్ 16 వరకూ ఆగాల్సిందే. ఇక 'అవతార్ 3' సినిమా 2024లో, 'అవతార్ 4' సినిమా ను 2026 లో  'అవతార్ 5' ను 2028 లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు జేమ్స్ కామెరూన్.