పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. తప్పుకుందని కూడా కొందరు అంటున్నారు. ఈ విషయంపై నిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.


‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫొటోను సినిమా ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పోలీస్ గెటప్‌లో పవన్ కళ్యాణ్, పక్కనే ఆనంద్ సాయి నడుచుకుంటూ రావడం చూడవచ్చు. పవన్ కళ్యాణ్ చేతిలో కడియం, పుస్తకం కూడా ఉన్నాయి.






‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పొలిటికల్ సెటైర్స్ ఓ స్థాయిలో ఉంటాయని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 'బ్రో'లో కేవలం రెండే పొలిటికల్ సెటైర్ సీన్స్ ఉన్నాయి. అవి శాంపిల్ అయితే... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో సెటైర్ల సునామీ ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. 


పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఇంతకు ముందు తీసిన 'గబ్బర్ సింగ్' చూస్తే అందులో కూడా కొన్ని సెటైరికల్ డైలాగ్స్ ఉన్నాయి. వ్యంగ్యంగా సంభాషణలు రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పైగా ఆయనకు తెలుగు భాష మీద కూడా మంచి పట్టు ఉంది. సెటైర్ అని ఎదుటి వ్యక్తికి అర్థం అయ్యేలా, అది సెటైర్ కాదని తనను తాను సమర్ధించుకోగల విధంగా సంభాషణలు రాసే నేర్పు హరీష్ శంకర్ సొంతం. అభిమాన కథానాయకుడి కోసం హరీష్ శంకర్ ఏ విధమైన సంభాషణలు రాస్తారో చూడాలి.


'ఉస్తాద్ భగత్ సింగ్' కథలో పొలిటికల్ సెటైర్లకు ఆస్కారం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తమిళ బ్లాక్‌బస్టర్ 'తెరి'లో మూలకథను తీసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్, అభిమానుల అంచనాలకు తగ్గట్టు మార్పులు చేస్తున్నారు హరీష్ శంకర్. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. 'తెరి' సినిమాని గమనిస్తే అందులో ఒక ఎంపీని విలన్ పాత్రలో చూపించారు. ఎంపీకి ఎదురు తిరిగి హీరోయిజం చూపించే సీన్లు అందులో చాలానే ఉన్నాయి. ఈ ఒక్క హింట్ చాలదూ... సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవడానికి.


'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. ఇందులో మరో కథానాయికగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial