తెలంగాణాలో పెద్ద పండుగంటే బతుకమ్మే. ఊరువాడా ఏకమై ప్రతి ఏడాది ధూ..ధాం...గా ఈ పండుగను నిర్వహిస్తారు. ప్రవాస తెలంగాణ ప్రజలు కూడా చాలా అట్టహాసంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది బతుకమ్మ పై ప్రత్యేక గీతాలు విడుదలవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈసారి బతుకమ్మ సాంగ్ అదిరిపోయే రేంజ్లో సిద్ధమయిందట. ఈ పాట కోసం ఆస్కార్ విజేత రెహామాన్ రంగంలోకి దిగారు. ఆయన సంగీత దర్శకత్వంలోనే ఈసారి పాట రాబోతోంది. ఈ పాట చిత్రీకరణ బాధ్యతను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీసుకున్నారు. ఇక పాడింది కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉన్ని క్రిష్ణన్ అని తెలుస్తోంది. ఇక పాటను రాసింది తెలంగాణాకు చెందిన మిట్టపల్లి సురేందర్. పాట షూటింగ్ భూదాన్ పోచం పల్లి ఏరియాలో  రెండు రోజుల పాటూ సాగింది. నాలుగు నిమిషాల పాటూ అలరించే ఈ సాంగ్ ను  అక్టోబర్ 6న విడుదల చేయనున్నారు. రెహమాన్ సంగీతంలో పాట వస్తుండడంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


బిఏ రాజు టీమ్ ట్విట్టర్ ఖాతాలో బతుకమ్మ సాంగ్ కు సంబంధించిన విషయాలను పోస్టు చేశారు.  కవిత కల్వకుంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ కోసం ఈ బతుకమ్మ పాటను రూపొందించినట్టు ట్వీట్ ద్వారా తెలుస్తోంది.  ఏఆర్ రెహామాన్, గౌతమ్ మీనన్ వంటి దిగ్గజాలతో బతుకమ్మ సాంగ్ ను చేయాలన్న ఆలోచన, కృషి కల్వకుంట్ల కవితదే. ఈ పాట బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉర్రూతలూపడం ఖాయం.