AR Rahman issues legal notice amid divorce with Saira Banu | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇటీవల తన విడాకుల నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. రెహమాన్, ఆయన భార్య సైరా బాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని మొదట సైరా బాను తరఫున లాయర్ వందనా షా వెల్లడించారు. రెహమాన్ సైతం విడాకులపై ప్రకటన చేశారు. తమ జీవితంలో ఇది టఫ్ ఫేజ్ అని వారి ప్రకటనల్లో ఇద్దరూ పేర్కొన్నారు. 


తనపై దుష్ప్రచారం జరిగిందని రెహమాన్ ఆగ్రహం


ఏఆర్ రెహమాన్, సైరాబాను విడాకుల విషయంపై కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో, ప్రధాన మీడియా సంస్థలు సైతం తమ వార్తలతో దుష్ప్రచారం చేశాయని మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపించారు. పరస్పర అంగీకారంతో తాము విడాకులు తీసుకోగా, అనంతరం జరిగే పరిణామాలతో తనకు ముడిపెట్టారన్నది రెహమాన్ వాదన. తన బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు తెలియాలని విడాకుల నిర్ణయం అధికారికంగా ప్రకటించారు. ఎంతో బాధతో తీసుకున్న నిర్ణయం అని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని సైతం పేర్కొనగా కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడంపై రెహమాన్ మండిపడ్డారు. తన విడాకుల విషయంపై దుష్ప్రచారం చేసిన అన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లకు లీగల్ నోటీసులు రెహమాన్ పంపించారు. 


రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే, ఆయన వద్ద పనిచేసే అసిస్టెంట్ మోహిని డే సైతం తన భర్తతో విడిపోయింది. కోల్‌కతాకు చెందిన బాస్ ప్లేయర్ మోహిని డే విడాకుల ప్రకటనతో రెహమాన్ ఆమెను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని జరిగిన ప్రచారం తన క్లయింట్ ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినట్లు రెహమాన్ తరఫు లాయర్ నర్మదా సంపత్ తెలిపారు. రెహమాన్ సూచన మేరకు ఆయన విడాకులు, అనంతరం జరిగిన పరిణామాలపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ మీడియా ఔట్‌లెట్స్‌కు, సోషల్ మీడియా ఖాతాలకు శనివారం నాడు (నవంబర్ 23న) నోటీసులు జారీ చేశారు. 






కొందరితో తన జీవితంపై ఇంటర్వ్యూలు చేశారని కీలక నిర్ణయం


కొందరు ఎవరెవరినో ఇంటర్వ్యూ చేసి తనపై దుష్ప్రచారం చేశారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాలు తన క్లయింట్ రెహమాన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులను ఎంతగానో బాధించడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు లీగల్ నోటీసులు జారీ చేశారని లాయర్ నర్మదా సంపత్ వెల్లడించారు. సోషల్ మీడియాలో, మీడియా ఛానల్స్, వెబ్ సైట్లలో ప్రజలకు ఉపయోగపడే, ప్రయోజనకరమైన విషయాలు పోస్ట్ చేయాలి కానీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేసి క్యాష్ చేసుకోవడం తీవ్రమైన అంశమన్నారు. ఈ క్రమంలో రెహమాన్ పరువునష్టం దావాకు వెళ్లారని తెలిపారు.



వారికి 24 గంటలు గడువు..
తన విడాకులపై, తన కుటుంబంపై అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసేలా ఉన్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు డిలీట్ చేయాలని తన నోటీసులలో రెహమాన్ వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లోగా తనపై జరిగిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ఏ రూపంలో ఉన్నా, మొత్తం తొలగించాలని లేకపోతే భారతీయ న్యాయ సంహితలోని 356 సెక్షన్ ప్రకారం క్రిమినల్ డిఫమేషన్ దాఖలు చేస్తామని రెహమాన్ హెచ్చరించినట్లు లాయర్ తెలిపారు. వారి పబ్బం గడుపుకునేందుకు ఇతరుల జీవితాలపై దుష్ప్రచారం, జుగుప్సాకరమైన విషయాలు వ్యాప్తి చేయడం సరికాదని హితవు పలికారు. యూబ్యూబ్, ట్విట్టర్ (ఎక్స్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర ఆన్‌లైన్ సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో చేసిన అసత్యప్రచారానికి సంబంధించి మొత్తం కంటెంట్ తొలగించాలని నోటీసులతో రెహమాన్ హెచ్చరించారు. 


Also Read: AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను