Oppenheimer: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఇండియాలోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇటీవల ఈ దర్శకుడి నుంచి వచ్చిన మూవీ ‘ఓపెన్ హైమర్’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతను అవమానించే విధంగా చూపించారంటూ గత కొద్ద రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. 


సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చింది: అనురాగ్ ఠాకూర్


‘ఓపెన్ హైమర్’ సినిమాలోని ఓ బోల్డ్ సీన్ లో ప్రధాన పాత్ర భగవద్గీత శ్లోకం చదువుతున్నట్టు చూపించారు. అదే ఇప్పుడు మూవీపై విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై స్పందించారు. ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శృంగార సన్నివేశంలో భగవద్గీత చదివించేలా చూపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇందులో అభ్యంతరకరమైన సన్నివేశాలను సెన్సార్‌ బోర్డు తొలగించకపోవడంపై మండిప‌డ్డారు. అసలు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎలా స‌ర్టిఫికెట్ ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు. వెంట‌నే స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు అనురాగ్. మరోవైపు భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ కూడా ఈ సన్నివేశంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానిని చిత్రం నుండి తొలగించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దర్శకుడు నోలన్ కు ఓ లేఖ రాశారాయన. 


‘ఓపెన్ హైమర్’ మూవీ కథ ఇదే..


రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అణు బాంబు తయారు చేయమని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ ని అమెరికన్ అటామిక్ ఎనర్జీ అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్ సంప్రదిస్తారు. లాస్ అల్మాస్ పేరుతో ఓ నగరాన్ని నిర్మించి, కొంత మంది శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగాలు చేస్తారు. విజయవంతంగా అణుబాంబు తయారు చేస్తారు. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రభుత్వం ఆ బాంబులు వేస్తుంది. అణుబాంబు తయారీకి ముందు ఓపెన్ హైమర్ జీవితంలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైంది? అణుబాంబు ప్రయోగించిన కొన్నేళ్ళ తర్వాత ఓపెన్ హైమర్ మీద అమెరికా ప్రభుత్వం ఎందుకు ట్రయిల్ చేపట్టింది? అనేది సినిమా ఇక ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించారు. మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్, రామి మాలెక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. 


ఇక ఓపెన్​హైమర్ వసూళ్ల విషయానికొస్తే.. ఈ సినిమా జులై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వీకెండ్ సమయానికి ఈ మూవీకు 165 మిలియన్​ డాలర్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయతే ఇండియాలో తొలి రెండు రోజులు ఈ సినిమా రూ.31 కోట్లను వసూలు చేసుకుంది. మరి మూవీపై వస్తోన్న విమర్శల నేపథ్యంలో మూవీ ఓవరాల్ గా ఇండియాలో ఎంతక కలెక్ట్ చేస్తుందో చూడాలి.


Also Read: తమన్ చేసిన అతిపెద్ద తప్పు - తప్పని ట్రోలింగ్ కష్టాలు!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial