తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి కోలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. హడావిడి మాములుగా ఉండదు. ఆయన చివరిగా నటించిన సినిమా 'దర్బార్'. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో 'పెద్దన్న' అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. 


Also Read: 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..


దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ ని, టీజర్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు. మద్రాస్, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 


చెల్లెలిని అమితంగా ప్రేమించే అన్న పాత్రలో రజినీకాంత్ కనిపించారు. అప్పటివరకు ఎంతో గారాబంగా చూసుకున్న తన చెల్లెలు విలన్ కారణంగా కష్టాల్లో పడుతుంది. పవర్ ఫుల్ విలన్ పాత్రలో జగపతిబాబు గెటప్ ఆకట్టుకుంటుంది. ఆయనకు భారీ డైలాగ్స్ కూడా ఇచ్చారు. ట్రైలర్ లో నయనతార, ఖుష్బూ, మీనా కనిపించారు. రూరల్ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా చూపించారు. విశ్వాసం వంటి సూపర్ హిట్ తర్వాత శివ రూపొందిస్తున్న సినిమా కావడంతో దీని కోసం తమిళ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, డి.సురేష్ బాబు పంపిణీ చేయనున్నారు.