Anasuya Bharadwaj About Vijay Devarakonda Issue: టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయకు, హీరో విజయ్ దేవరకొండకు కొన్నేళ్ల నుంచి కోల్డ్ వార్ జరుగుతోంది. ‘అర్జున్ రెడ్డి‘ సినిమాతో మొదలైన గొడవ ‘లైగర్‘ తర్వాత మరింత ముదిరింది. ‘లైగర్‘ రిలీజ్ టైమ్ లో విజయ్ దేవరకొండ వ్యవహార శైలిపై విమర్శలు చేసింది. విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ‘ది విజయ్ దేవరకొండ‘ అని పెట్టుకోవడం పైనా నెగెటివ్ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పెద్ద వివాదం కొనసాగింది. విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. నెమ్మదిగా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇకపై విజయ్ గురించి మాట్లాడబోనని వెల్లడించింది.


ఆ వివాదం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు-అనసూయ


తాజాగా మరోసారి విజయ్ దేవరకొండతో వివాదం గురించి అనసూయ కామెంట్ చేసింది. తాజాగా ‘సింబా‘  మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె మరోసారి పాత వివాదం గురించి మాట్లాడింది. తాను తప్పు చేయకున్నా, అందరూ తననే టార్గెట్ చేసి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. “నేను ఆ వివాదానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేను. సినిమాలో ఎలాగైతే మెసేజ్ ఇస్తారో? నేను కూడా అలాగే ఇవ్వాలని అప్పుడు రియాక్ట్ అయ్యాను. స్టేజి మ్యానర్స్ గురించే మాట్లాడాను. లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని చెప్పాను. కొన్నిసార్లు కొంత మంది మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఆ విషయం అందరికీ అర్థం అవుతుంది. ఆ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాల్సి ఉండేది. మీడియా ప్రశ్నించలేదు కాబట్టే నేను ప్రశ్నించాను. తప్పు ఎత్తి చూపించినందుకు నన్నే అందరూ మాటలు అన్నారు. ముమ్మాటికీ అది మీ తప్పే. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లు ఉంది మీ వ్యవహారం. ఎవరిపైనా నాకు ద్వేషం లేదు. ఆయా పరిస్థితులను అనుగుణంగానే మాట్లాడాను. ఆ ఘటనతో చాలా నేర్చుకున్నాను” అని క్లారిటీ ఇచ్చింది.   






‘సింబా’ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రస్తావన


అనసూయ తాజాగా నటించిన ‘సింబా’ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడులైంది. ఈ ట్రైలర్ లో ఓ చోట విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని చెప్పగానే, అనసూయ సిగ్గు పడుతూ కనిపిస్తుంది. ఈ సీన్ చూసిన తర్వాత మీడియా ప్రతినిధులు, విజయ్ వివాదంపై మరోసారి ప్రశ్నించారు. అనసూయ కూడా ఆ ఘటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అనసూయ చెప్పుకొచ్చింది.  సీనియర్ నటుడు జగపతి బాబు, అనసూయా భరద్వాజ్, సీనియర్ నటి గౌతమి కీలక పాత్రల్లో ‘సింబా’ అనే సినిమా తెరకెక్కింది. మురళీ మనోహర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Also Read: ‘ఇంద్ర’ విడుదలై 22 ఏళ్లు - మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న సినిమా, రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?