తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే సీనియర్ నటి జమున కన్నుమూశారు. అదే రోజున ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి గుండెపోటుతో చనిపోయారు. వారి మరణ విషాదం నుంచి ఇండస్ట్రీ బయటపడక ముందే మరో ఘనట జరిగింది. ప్రముఖ తెలుగు దర్శకుడు సాగర్ (70) కన్నుమూశారు. దర్శకుడు సాగర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలోని తన నివాసంలో ఇవాళ (గురువారం) ఉదయం 6 గంటలకు కన్నుమూశారు.
‘రాకాసి లోయ‘ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన సాగర్
దర్శకుడు సాగర్ ‘రాకాసి లోయ‘ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు. 1983లో వచ్చిన సినిమాలో నరేష్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా పనిచేశారు. ఆ తర్వాత కృష్ణ, సౌందర్య హీరో, హీరోయిన్లుగా ‘అమ్మదొంగ’ సినిమాను తెరకెక్కించారు. భానుచందర్, లిజీలతో కలిసి ‘స్టూవర్టుపురం దొంగలు’, ‘అమ్మనా కోడలా’ ‘రామసక్కనోడు‘, ‘ఖైదీ బ్రదర్స్‘, ‘అన్వేషణ‘ సహా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన ‘రామసక్కనోడు‘ చిత్రానికి మూడు నంది పురస్కారాలు పొందారు.
3 సార్లు తెలుగు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు
ఇక తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడు సాగర్ ఎంతో సేవ చేశారు. తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. దర్శకుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎంతో చొరవ చూపించారు. సాగర్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ చెన్నైలో సాగర్ అంత్యక్రియలు
సాగర్ అంత్యక్రియలు ఇవాళ చెన్నైలో జరిగే అవకాశం ఉంది. అధికారికంగా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇవాళ సాయంత్రం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్యే జమున, శ్రీనివాసమూర్తి మృతి
కొద్ది రోజుల క్రితమే సీనియర్ హీరోయిన్ జమున వయసు ప్రభావంతో పాటు ఆరోగ్య సమస్యలతో మృతి చెందారు. గుండెపోటు కారణంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. 86 ఏళ్ళు జమున హైదరాబాద్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో సుమారు 198 చిత్రాల్లో జమున నటించారు. తొలి సినిమా చేసినప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి కూడా ఈ మధ్యే కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సినిమా పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏండ్ల తరబడి ఆయన సేవలు అందించారు. ఎంతో మంది తమిళ స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి ప్రముఖ హీరోలకు ఆయన తెలుగు డబ్బింగ్ అందించారు.
Read Also: మూగబోయిన ‘సింగం’ గొంతు - ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మృతి