బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి ఢిల్లీలో ఓ బంగ్లా ఉంది. సౌత్ ఢిల్లీలో గల ఆ బంగ్లా పేరు 'సోపాన్'. అమితాబ్ తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ అందులోనే ఉండేవారు. హీరో కావాలని, సినిమాలపై ప్రేమతో ముంబై మహానగరానికి వచ్చే ముందు వరకూ బిగ్ బి కూడా ఆ ఇంటిలోనే ఉన్నారు. బచ్చన్ ఫ్యామిలీకి చెందిన మొట్ట మొదటి ఇల్లు అదే. ఇన్నాళ్లు 'సోపాన్' అంటే అమితాబ్ బచ్చన్, ఆయన ఫ్యామిలీకి చెందినది. కానీ, ఇకపై కాదు. ఎందుకంటే... అమ్మేశారు.
'సోపాన్'ను రూ. 23 కోట్లకు నిజోనే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో అవని బడెర్‌కు అమితాబ్ అమ్మేసినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ఇంటిలో హరివంశ్ రాయ్ బచ్చన్ కవితా చర్చలు కూడా నిర్వహించేవారని చెబుతుంటారు. బచ్చన్ కుటుంబ సభ్యులకు అవని బడెర్ చాలా రోజుల నుంచి తెలుసట. ఆ ఇంటికి దగ్గరలోనే ఉంటారట. అందుకని, ఆయనకు ఇచ్చేశారట.
ఢిల్లీలో ఇంటిని అమ్మేసినా... ముంబైలోని జుహు ఏరియాలో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి ఐదు బంగ్లాలు ఉన్నాయి. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్సా, అమ్ము - ఆ ఐదు బంగ్లాల పేర్లు. గత ఏడాది అంధేరిలో రూ. 31 కోట్లు పెట్టి ఒక డూప్లెక్స్ ఫ్లాట్ కూడా కొన్నారు. జల్సాలో అమితాబ్ నివాసం ఉంటున్నారు. ఆయన్ను చూడటం కోసం అభిమానులు ఆ ఇంటి తీరతారు. పుట్టినరోజు అప్పుడు కూడా ఆ ఇంటి దగ్గరకు వెళతారు.