Pocso Case On Ekta Kapoor: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తో పాటు ఆమె తల్లిపై ముంబై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆల్ట్ బాలాజీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయిన ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ లో బాలికలను అభ్యంతరకరంగా చూపించారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాజాగా ఈ కేసుపై ఆల్ట్ బాలాజీ ఓటీటీతో పాటు ఆల్ట్ బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ సంస్థ స్పందించింది. ఈ వెబ్ సిరీస్‌తో ఏక్తా కపూర్ కు, ఆమె తల్లి శోభా కపూర్ కు సంబంధం లేదని వెల్లడించింది. కేసు విచారణకు తమ సంస్థ పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించింది.   


ఆల్ట్ బాలాజీ ఏం చెప్పిందంటే?


పోక్సో కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు  ఆల్ట్ బాలాజీ ఓటీటీ సంస్థ వెల్లడించింది. “'గంధీ బాత్' వెబ్ సిరీస్ కు సంబంధించి తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ట్ డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ POCSO చట్టాన్ని గౌరవిస్తుంది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఏ బాధ్యత అయినా, మా సంస్థ తీసుకుంటుంది. న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో కొన్ని విషయాలను బయటకు చెప్పలేకపోతున్నాం” అని వెల్లడించింది.   


ఏక్తా కపూర్ కు నేరుగా సంబంధం లేదు


ఓటీటీలో ప్రసారం అయిన ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ కు నిర్మాత ఏక్తా కపూర్ కు నేరుగా సంబంధం లేదని ఆల్ట్ బాలాజీ వెల్లడించింది. “ఆల్ట్ బాలాజీ కార్యకలాపాల్లో ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ నేరుగా పాల్గొనడం లేదు. దాని కంటెంట్ ను కూడా ఆమె పర్యవేక్షించడం లేదు. ప్రత్యేక టీమ్ ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన కంటెంట్ సహా ఇతర నిర్మాణ పనులను చూసుకుంది. ఏక్తా కపూర్ కు, ఈ వెబ్ సిరీస్ కు ఎలాంటి సంబంధం లేదు” అని ఆల్ట్ బాలాజీ వివరణ ఇచ్చింది.



మహిళా నిర్మాతపై పోక్సో కేసు ఏంటి?


ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ ‘గంధీ బాత్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 సీజన్లుగా ఆల్ట్‌ బాలాజీ ఓటీటీ వేదిగా స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈ వెబ్ సిరీస్ లో బాలికలను అశ్లీలంగా చూపించారంటూ ఫిర్యాదు చేశారు. చిత్ర నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా నిర్మాతపై పోక్సో కేసు ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు.  అయితే, 12 ఏండ్ల లోపు వయసున్న బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. చిన్న పిల్లలపై అత్యాచారం చేయడమే కాదు, సినిమాలు, సిరీస్ లలో అశ్లీలంగా చూపించినా ఈ చట్టం ప్రకారం నేరమే అవుతుంది. ఈ నేపథ్యంలో ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ నిర్మాతగా ఉన్న ఏక్తాకపూర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  


Read Also: ప్రభాస్ ఫ్యామిలీ పర్సనల్ ఆల్బమ్‌లో ఫోటోలు చూశారా... ఈ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్