Allu Sirish New Movie: మెగా హీరో అల్లు శిరీష్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత ఇంత వరకు మరో సినిమా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మంగళవారం (మే 30వ తేదీ) దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిపారు.


కానీ పోస్టర్‌ను బట్టి చూస్తే సందీప్ కిషన్‌తో అనౌన్స్ అయి ఆగిపోయిన ‘బడ్డీ’ సినిమా అని తెలుస్తోంది. 2023 సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ తమ కంటెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అందులో సందీప్ కిషన్ హీరోగా ‘బడ్డీ’ సినిమాను కూడా ప్రకటించారు.‘మైఖేల్’ విడుదల అయ్యాక దీని టీజర్ కూడా వస్తుందని తెలిపారు. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని తిరిగి అల్లు శిరీష్‌తో అనౌన్స్ చేస్తున్నట్లు ఉన్నారు.


సందీప్ కిషన్ కమిట్ అయినప్పుడు తమిళ దర్శకుడు శామ్ ఆంటోన్ దీనికి దర్శకుడిగా ఉన్నారు. మరి దర్శకుడిగా ఆయనే ఉంటారా? వేరే వారు కమిటయ్యారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమా పోస్టర్ ఆర్య గతంలో నటించిన ‘టెడ్డీ’ తరహాలో ఉంది. పక్కనే టెడ్డీ బేర్‌తో వెనక్కి తిరిగి నిలబడి ఉన్న అల్లు శిరీష్‌ను ఈ పోస్టర్‌లో చూడవచ్చు.


ఈ సినిమా రీమేక్ కాదని అల్లు శిరీష్ తెలిపారు. అప్పట్లో ‘టెడ్డీవర్స్’లో ఈ సినిమా జరుగుతుందని ప్రకటించారు. మరి కథలో ఏమైనా మార్పులు చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ టెడ్డీవర్స్‌లో జరిగితే మాత్రం సౌత్ ఇండియాలో ఇది కొత్త సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పవచ్చు.


ఇక ‘టెడ్డీ’ సినిమా విషయానికి వస్తే... ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ తాను బతికుండగానే టెడ్డీ బేర్‌లో ప్రవేశించి హీరో ద్వారా తన ప్రాణాలు కాపాడుకుంటుంది. హీరో పాత్రలో ఆర్య, కోమాలో ఉన్న అమ్మాయి పాత్రలో సాయేషా సైగల్ నటించారు.






సందీప్ కిషన్‌తో బడ్డీ అనౌన్స్‌మెంట్ ట్వీట్లు