మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'మగధీర' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో రామ్ చరణ్ కి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సినిమా తరువాత అల్లు అరవింద్ తో మరో సినిమా చేయలేదు జక్కన్న. 


ఇద్దరి మధ్య చిన్న డిస్టబెన్స్ ఏర్పడిందని.. ఆ కారణంగానే రాజమౌళి.. అల్లు అరవింద్ తో కలిసి పని చేయలేదనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించాలని భావిస్తున్నారు అల్లు అరవింద్. 


చాలా కాలంగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో రాజమౌళి సినిమా చేస్తాడని అంటున్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు బన్నీకి 'పుష్ప'తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇదే సమయంలో రాజమౌళితో ఓ సినిమా పడితే బన్నీ రేంజ్ మరింత పెరిగిపోతుంది. అందుకే అల్లు అరవింద్ తన మాస్టర్ ప్లాన్ ను వర్కవుట్ చేయాలని చూస్తున్నారు. ఇదే విషయంపై రాజమౌళితో చర్చలు కూడా జరిపారట. 


ఈ విషయంలో రాజమౌళి పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. కానీ ప్రస్తుతం తను మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యానని.. అది పూర్తి చేసిన తరువాత కచ్చితంగా ఆలోచిస్తానని మాటిచ్చారట. మరి బన్నీ హీరోగా రాజమౌళి సినిమా సెట్ అవుతుందేమో చూడాలి. 


ప్రస్తుతం రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించిన ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా ఆలస్యమవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.