యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివది హిట్ కాంబినేషన్. ఇద్దరి ఖాతాలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. ఎన్టీఆర్ 'బృందావనం' సినిమాకు కొరటాల రచయిత. అదీ హిట్టే. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించిన సంగతి తెలిసిందే. హీరోగా ఎన్టీఆర్ 30వ చిత్రమిది. ఫిబ్రవరి 18న పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా రానున్నారని ఫిలిం నగర్ టాక్.
ఎన్టీఆర్, బన్నీ మధ్య మంచి స్నేహం ఉంది. నిజం చెప్పాలంటే... ఎన్టీఆర్ 30కి ముందు కొరటాల శివతో బన్నీ ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. 'పుష్ప' రెండు పార్టులుగా తీయాలని అనుకోవడం, కరోనా వల్ల ఆలస్యం కావడంతో... ఆ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. అల్లు అర్జున్‌తో సినిమా కంటే ముందు ఎన్టీఆర్ 30 చేయడానికి రెడీ అయ్యారు. అటు హీరో... ఇటు దర్శకుడు... ఇద్దరికీ బన్నీతో అనుబంధం ఉండటంతో ఆయన్ను సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించారట.
సందేశాత్మక కథలకు కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీయడం కొరటాల శివ శైలి. ఎన్టీఆర్ 30 కోసం ఆయన మంచిస్క్రిప్ట్ రెడీ చేశారట. ఇందులో ఆలియా భట్ కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్.