2021 సంవత్సరానికి దేశంలోని బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన ‘పుష్ప: ది రైజ్’ ఓటీటీ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రారంభం అయింది. డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు వస్తుందని అమెజాన్ ప్రకటించినప్పటికీ.. చెప్పిన సమయం కంటే గంటన్నర ముందే స్ట్రీమింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం 6:30కే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.
విడుదలైన 21 రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల అయితే.. థియేట్రికల్ రన్ ఉండబోదన్న ఉద్దేశంతో ఈ సినిమాను త్వరగా స్ట్రీమింగ్‌కు ఇచ్చేశారు. అయితే కరోనావైరస్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. అయినప్పటికీ ఓటీటీ విడుదలను వెనక్కి జరపకుండా అనుకున్న టైంకే స్ట్రీమింగ్ చేశారు.
అయితే ప్రస్తుతానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు మాత్రమే స్ట్రీమ్ అవుతున్నాయి. హిందీ వెర్షన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. సౌత్ సినిమాలను యూట్యూబ్‌లో విడుదల చేసే గోల్డ్‌మైన్ టెలిఫిల్మ్స్ దగ్గర హిందీ హక్కులు ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మేర దాటినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత పెద్ద హిట్ ఇదే. 2020లో అల వైకుంఠపురములో, 2021లో పుష్ప: ది రైజ్‌లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్లతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ‘పుష్ప: ది రూల్’ 2022 డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే దీనికి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి, మార్చిల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.