ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యింది. దుశ్యంతుడు, శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల అయ్యింది.   మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది. ఆమె నటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతంగా నటించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  


అర్హ నటన నచ్చుతుంది అనుకుంటున్నా- బన్నీ


ఇక అల్లు అర్జున్ సైతం ‘శాకుంతలం’ సినిమాలో అర్హ నటనపై ప్రశంసలకు కురిపించారు. ముందుగా చిత్ర బృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.” ‘శాకుంతలం’ రిలీజ్ సందర్భంగా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్. ఇలాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించిన గుణశేఖర్, నీలిమ గుణ, దిల్ రాజుకు నా శుభాకాంక్షలు. స్వీటెస్ట్ లేడీ సమంత, మల్లు బ్రదర్ దేవ్ మోహన్ తో పాటు చిత్ర బృందానికి అభినందనలు. ఈ చిత్రంలో ‘‘అల్లు అర్హా చేసిన లిటిల్ క్యామియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆమెను తెరపై పరిచయం చేసినందుకు, అలాగే షూటింగ్ లో జాగ్రత్తగా చూసుకున్నందుకు గుణ గారికి ధన్యవాదాలు. ఈ మధుర క్షణాన్ని ఎప్పుడూ మర్చిపోలేను'' అంటూ ట్వీట్ చేశారు.










అర్హ నటనపై అందరిలో ఆసక్తి


‘శాకుంతలం’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అర్హ పాత్రపై సినీ అభిమానులలో బాగా ఆసక్తి నెలకొంది. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టడం, సింహం మీద కూర్చుని ఠీవీగా రావడం అభిమానులకు బాగా నచ్చేసింది. సినిమా ప్రమోషన్స్ లో సైతం సమంత అర్హ నటన గురించి గొప్పగా చెప్పడంతో అందరికీ ఆమె పాత్రపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. తొలి షో చూసిన ప్రేక్షకులు అర్హ నటనకు ఆశ్చర్యపోయారు. సినిమా చివరి 15 నిమిషాల్లో తన చక్కటి నటనతో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. అచ్చం తండ్రి మాదిరిగానే అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అల్లు ఫ్యామిలీ నట వారసత్వాన్ని అర్హ ముందుకు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నారు.


అర్హను చూస్తే ఎంతో ముచ్చటేసింది- సమంతా


అటు అల్లు అర్హ గురించి సమంత చాలా విషయాలు చెప్పింది. అర్హతో సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పడిన అనుబంధం గురించి వివరించింది. అర్హను చూసిన తొలిరోజు తనకు ఎంతో ముచ్చటేసిందని చెప్పింది. “అల్లు అర్హ సెట్స్ లో తెలుగులో మాట్లాడుతుంటే ఎంతో క్యూట్ గా ఉంటుంది. తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. ఆమెకు ఇంగ్లీష్ రాదు. హాయ్ కూడా తెలుగులోనే చెబుతుంది. ఈ సినిమాలో అర్హకు పెద్ద పెద్ద డైలాగ్ లు ఉన్నాయి. అవి కూడా వందల మంది ముందు చెప్పాలి. కానీ, అర్హ ఏమాత్రం భయపడకుండా చెప్పింది” అని సమంతా వివరించింది.


ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మించారు.  ఇందులో దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు నటించారు.


Read Also: సమంత తన భుజాలపై ‘శాకుంతలం’ మూవీని నిలబెట్టింది: ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ డైరెక్టర్స్ రివ్యూ