కాన్ స్టార్ అల్లు అర్జున్‌కు యూఏఈ(UAE) ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దుబాయ్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారు. యూఏఈలో ‘గోల్డోన్ వీసా’ పొందడం అంత ఈజీ కాదు. కేవలం ప్రముఖ నటులు, వైద్యులు, వాణిజ్యవేత్తలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులకు మాత్రమే లభిస్తుంది. 


‘గోల్డెన్ వీసా’ ప్రయోజనాలేమిటీ?


ఈ గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర ఎమిరేట్స్‌లో పదేళ్ల వరకు నివసించవచ్చు. విదేశీయులు వారి దేశంలో ఎక్కువ కాలం నివసించేందుకు వీలుగా యూఏఈ ప్రభుత్వం 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాలను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో దీని గడువు ఐదేళ్ల వరకు ఉండేది. రెండేళ్ల కిందట దాన్ని పదేళ్లకు పెంచారు. ఈ వీసా కలిగిన వ్యక్తులు తమ భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అబుదాబీలో పదేళ్లు నివసించవచ్చు. ఆ తర్వాత గడువును పొడిగించుకోవచ్చు కూడా. గోల్డెన్ వీసా హోల్డర్లు నూరు శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే, ఈ వీసాను పొందడం సామాన్యులకు సాధ్యం కాదు. 2018 కేబినెట్ తీర్మానం నెం.56 ప్రకారం.. యూఏఈలో నివసించేందుకు దరఖాస్తు చేసుకొనే పెట్టుబడిదారులు కనీసం రూ.21 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉండాలి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి ఎంతో పాపులారిటీ ఉంటేనే ఈ వీసాకు అర్హత సాధిస్తారు. మొత్తానికి అల్లు అర్జున్ కూడా అక్కడ నివాస అర్హతను సాధించారు.ఈ నేపథ్యంలో బన్నీ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఎన్నాళ్లైనా ఉండొచ్చు. 


షారుఖ్ ఖాన్‌తో మొదలు..


యూఏఈ ప్రభుత్వం నుంచి తొలి ‘గోల్డెన్ వీసా’ను అందుకున్న మొట్టమొదటి సెలబ్రిటీ.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఆ తర్వాత సంజయ్ దత్, సానియా మీర్జా సైతం గోల్డెన్ వీసాలను పొందారు. కమల్ హాసన్, మమ్ముటీ, మోహన్ లాల్, సోను సూద్, మౌనీ రాయ్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, వరుణ్ ధావన్, ఊర్వశీ రౌతేలా, సునీల్ శెట్టి, నేహా కక్కర్, ఫరా ఖాన్, రణ్‌వీర్ సింగ్, రామ్ చరణ్ భార్య ఉపాసన, విక్రమ్, త్రిషా, టోమినో థామస్, పూర్ణ, కాజల్ అగర్వాల్, దుల్కర్ సల్మాన్, మీనా, విజయ్ సేతుపతి.. ఇలా గోల్డెన్ వీసాలను పొందిన మన సెలబ్రిటీల లిస్టు పెద్దదే ఉంది. వీరంతా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు అవసరం లేకుండా స్వేచ్ఛగా అక్కడ నివసించవచ్చు. పదేళ్ల గడువు ముగిసిన తర్వాత వీసా దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి పౌరులతో సమానంగా ‘గోల్డెన్ వీసా’ పొందిన సెలబ్రిటీలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ నివసించవచ్చు. 






Read Also: దారికొచ్చిన రష్మిక? రిషబ్ శెట్టిపై పాజిటివ్ కామెంట్స్!