Allu Arjun :  దర్శక ధీరుడు రాజమౌళికి సమానమైన స్థాయిలో క్రియేటివిటీకి పదింతలు జోడించి సినిమా తీయగల దర్శకుల్లో ఒకరు వెట్రిమారన్. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ప్రతీ హీరో ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసే. ఆ ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరని అందరూ ఉంటారు కూడా. అలాంటిది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమాకు నో చెప్పారట. తాజాగా వెట్రీ మాట్లాడిన ఈ మాటలు అదే అర్థం వచ్చేలా ఉన్నాయి. దీంతో బన్నీ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడంటూ ఆయన ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.


సుకుమార్ డైరెక్షన్ వచ్చిన 'పుష్ప' సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థాయిని ఐకాన్ స్టార్ అయ్యే వరకు తీసుకెళ్లింది. ఆ సినిమాలోని బన్నీ యాక్టింగ్, పాటలు, డైలాగులు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం.. తాజాగా 'పుష్ప 2 : ది రైజ్" పేరుతో మళ్లీ తెరపైకి రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుండగా.. ఇటీవల మూవీకి సంబంధించిన టీజర్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పార్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. సీక్వెల్ పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే.. సుకుమార్ 'పుష్ప 2'ను రూపొందిస్తున్నట్టు టీజర్ ను చూస్తేనే తెలుస్తోంది. ఇక బన్నీ లుక్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పిక్.. మెడలో నిమ్మకాయల దండ, చీర, నగలు ధరించి, చేతిలో కత్తి పట్టుకోవడం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో బన్నీ హిట్స్ లిస్ట్ లో 'పుష్ప 2' చేరిపోతుందని ఆయన ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


ఇక దర్శకుడు వెట్రి మారన్ విషయానికొస్తే.. ఇండియాలోని ది బెస్ట్ డైరెక్టర్స్ లలో వెట్రి ఒకరు. ఆయన ఇప్పటివరకు తీసింది కేవలం ఐదు సినిమాలే అయినా..ప్రతి సినిమా ఓ అద్భుతం, సంచలనంగా మారింది. అంతే కాదు ఆయన సినిమా తీస్తే అవార్డులు వెతుక్కుని మరీ వస్తాయని ఆయన ఫ్యాన్స్ అంటూంటారు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీసే వెట్రీ.. ఇటీవలే 'విడుతలై పార్ట్ 1' తీసి మంచి హిట్ కొట్టారు. ఇటీవలే తెలుగు వెర్షన్ 'విడుదల పార్ట్ 1' ట్రైలర్ కూడా రిలీజ్ కావడంతో తెలుగు ఫ్యాన్స్ కూడా ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. 


ఓ కమెడియన్ ను హీరోగా పెట్టి భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసిన వెట్రీ.. విడుతలై తెలుగు వెర్షన్ త్వరలోనే  ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన వెట్రీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. 'అడాకులం' సినిమా తర్వాత 'వడ చెన్నై' స్క్రిప్ట్‌తో అల్లు అర్జున్‌ను కలిశానని, కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఓకే కాలేదని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 'వడ చెన్నై' సినిమా ధనుష్‌కు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ధనుష్ మార్కెట్‌ను కూడా రెండింతలు చేసింది. దీంతో అల్లుఅర్జున్‌ 'గోల్డెన్‌ ఛాన్స్'  మిస్ చేసుకున్నాడని నెటీజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. తమిళనాడులోనూ మంచి క్రేజ్ ఉండడంతో... వెట్రీ, అల్లు అర్జున్ కాంబోలో భవిష్యత్తులోనైనా సినిమా రావాలని ఆశపడుతున్నారు.