అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా 'అల... వైకుంఠపురములో'. హిందీలో డబ్బింగ్ చేశారు. థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఆల్రెడీ ఆ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తుండటం, రీమేక్ నిర్మాతలకు - డబ్బింగ్ నిర్మాతకు మధ్య అండర్‌స్టాండింగ్ కుదరడంతో థియేటర్లలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఆపేశారు. అందుకు కారణం 'అల...' రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ అని డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్ మైన్స్ మనీష్ షా ఆరోపిస్తున్నారు.
'అల... వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో విడుదల చేస్తే... తాను 'షెహజాదే' సినిమా చేయనని, మధ్యలో మానేస్తానని, సినిమా నుంచి వాకౌట్ చేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మాతలకు చెప్పారట. 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఆల్రెడీ షూటింగ్ చేసిన సినిమాకు ఖర్చు లెక్క వేసుకుంటే రూ. 40 కోట్ల వరకూ తేలిందట. 'అల... వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు లాభం వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదని విడుదల చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నానని మనీష్ షా తెలిపారు. ఫిబ్రవరి 6న 'అల... వైకుంఠపురములో' హిందీ వెర్షన్ 'దించాక్' టీవీలో ప్రీమియర్ కానుంది.
"నాకు షెహజాదే నిర్మాతలు పదేళ్లుగా తెలుసు. నా సన్నిహితులు రూ. 40 కోట్లు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని, అల వైకుంఠపురములో డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయడం లేదు. కార్తీక్ ఆర్యన్ కోసం నేను ఈ పని చేయడం లేదు. అల్లు అరవింద్ కోసం చేస్తున్నాను. ప్రస్తుతానికి 'అల... వైకుంఠపురములో' డబ్బింగ్ వెర్షన్ కేవలం టీవీ(దించాక్)లో విడుదల చేస్తున్నాం. అక్షయ్ కుమార్ 'లక్ష్మి' రికార్డ్స్ బ్రేక్ చేయడమే నా టార్గెట్. ఆ తర్వాత 'పుష్ప: ద రైజ్' రికార్డ్స్ బ్రేక్ చేస్తాం" అని మనీష్ షా తెలిపారు.
'షెహజాదే' రిలీజ్ అయ్యేవరకూ 'అల... వైకుంఠపురములో' హిందీ వెర్షన్ యూట్యూబ్ రిలీజ్ కూడా ఉండదట. అదీ సంగతి! కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న 'షెహజాదే'ను నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు.