బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి ఇందులో కీలకపాత్రల్లో నటించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అలియా. ఇటీవల తెలుగు మీడియాను ముంబైకి పిలిపించుకొని అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో ఓ పోస్ట్ పెట్టింది. 'రహీం లాలా.. 3 రోజుల్లో కలుద్దాం!' అంటూ అజయ్ దేవగన్ పాత్రకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. సినిమాలో అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియో చూస్తుంటే అర్ధమవుతుంది. 'నాలుగువేల మంది స్త్రీల భవిష్యత్తు.. గంగు ఈ పోరాటం నువ్ గెలిచే తీరాలి' అని అజయ్ దేవగన్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే వేశ్య గంగూబాయి ఒక రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగిందనేదే ఈ సినిమా. SLB భన్సాలీ ప్రొడక్షన్స్ అండ్ జయంతిలాల్ గడాస్ పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేకర్స్. మరేం జరుగుతుందో చూడాలి!