బాలీవుడ్ టాప్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తనంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన సినిమాలో నార్త్ తో పాటు సౌత్ లోనూ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అయితే, కరోనా తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి. కరోనా అనంతరం వచ్చిన తొలి మూవీ ‘బెల్ బాటమ్’ మంచి పాజిటివ్ టాక్ తో విడుదలైంది. అయితే, కరోనా భయం జనాల్లో పూర్తిగా పోకకపోవడంతో ఈ సినిమా తక్కువ వసూళ్లను సాధించింది. అక్షయ్ ఇటీవల నటించిన పలు సినిమాలు సైతం ఫ్లాప్ అయ్యాయి. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’ వంటి చిత్రాలు గట్టి ఎదురు దెబ్బ తీశాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.


రెమ్యునరేషన్ పై అక్షయ్ ఏమన్నారంటే?  


ప్రస్తుతం అక్షయ్ ఇమ్రాన్ హష్మీతో కలిసి ‘సెల్ఫీ’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రెమ్యునరేషన్ గురించి దాటవేత వైఖరి కనబర్చారు. ఒక్కో సినిమాకు రూ. 50 నుంచి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తల్లో వాస్తవమెంత? అనే ప్రశ్న మీడియా ప్రతినిధులు అడిగారు. తన ‘సెల్ఫీ’ సినిమాకు కూడా సుమారు రూ.100 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు. దీనికి అక్షయ్ చమత్కారంగా రియాక్ట్ అయ్యారు.  “మేరా బడియా రియాక్షన్ రెహతా హై. ఔర్ లగ్నా భీ చాహియే అచా, క్యుంకీ పాజిటివ్ బాతేన్ హై నా (నా స్పందన ఎప్పుడూ బాగుంటుంది. ఇవి సానుకూల చర్చలు కాబట్టి మీరు బాగుండాలి)” అని చెప్పారు.


తప్పు మాదే, మేమే సరిద్దుకోవాలి- అక్షయ్


ఇటీవలి కాలంలో అక్షయ్ కుమార్‌ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన తాజా మూవీస్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’ ఫ్లాప్ అయ్యాయి. ఈ సందర్భంగా బాక్సాఫీస్ వైఫల్యాల గురించి అక్షయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  “సినిమాలు సరిగా చేయలేకపోతున్నాం. అది మా తప్పు.  నా తప్పు. నేను మార్పులు చేసుకోవాలి. ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. మా తప్పుకు మరెవరినీ నిందించలేం” అని చెప్పారు.  


వరుస సినిమాల్లో అక్షయ్ బిజీ బిజీ


ప్రస్తుతం అక్షయ్ కుమార్  ఇమ్రాన్ హష్మీతో 'సెల్ఫీ' మూవీ చేస్తున్నారు. యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠితో 'OMG 2', టైగర్ ష్రాఫ్‌తో 'బడే మియాన్ చోటే మియాన్' సినిమాలు చేస్తున్నారు. అటు 'సూరరై పొట్రు' రీమేక్‌లో కూడా ఆయన నటించనున్నారు.  






Read Also: మోదీపై అక్షయ్ కుమార్ ప్రశంసలు - ఎందుకంటే..