రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో ఒక్కో సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. రీసెంట్ గానే 'లవ్ స్టోరీ' సినిమా రిలీజయింది. దీంతో మరిన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి. కానీ మహారాష్ట్రలో పరిస్థితి అలా లేదు. అక్కడ కేసులు ఎక్కువగా ఉండడంతో థియేటర్లు ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ దొరకలేదు. అందుకే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు ల్యాబ్ లోనే ఉండిపోయాయి.
Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..
రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'సూర్యవంశీ' సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి చాలా కాలమవుతోంది. ఇప్పటికే సినిమా విడుదల కావాలి కానీ కరోనా కారణంగా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలు కూడా నటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో హడావిడి జరిగింది. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
ఈ విషయాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి స్వయంగా వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అక్టోబర్ 22 నుంచి థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యుటర్లు, ప్రముఖ ఫిల్మ్ పెర్సనాలిటీస్ అందరూ కలిసి ముఖ్యమంత్రితో మీటింగ్ పెట్టగా.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో రోహిత్ శెట్టి పాల్గొన్నారు. థియేటర్లు తీర్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రికి థాంక్స్ చెబుతూ.. తన సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.