Bigg Boss Telugu 8  Promo Out: బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తెలుగు ప్రేక్షకుల పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలో 8వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే షో టీజర్ ను విడుదల చేసిన షో నిర్వాహకులు. ఇప్పుడు ప్రోమోను విడుదల చేశారు. ఇందులో షో హోస్టు నాగార్జున అదిరిపోయే డ్యాన్స్, కమెడియన్ సత్య ఫన్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. అందమైన భామలతో కింగ్ సూపర్ స్టెప్పులు వేయగా, సత్య అన్ లిమిటెడ్ ఫన్ కోసం వెరైటీ గెటప్ లో కనిపించి అలరించాడు. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ కి, ఫన్ కి, ట్విస్టులకు,  మలుపులకు లిమిట్ లేదంటూ నాగార్జున చెప్పే మాటలు షోపై అంచనాలు పెంచుతున్నాయి. త్వరలోనే ‘బిగ్ బాస్ 8’ ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ నాగార్జున తన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రోమోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.   



ప్రేక్షకులను అలరించిన 7 సీజన్లు


తెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షో బాగా సక్సెస్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ షో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. రికార్డు స్థాయిలో రేటింగ్స్ దక్కించుకుంది. ఇండియాలో అత్యధిక ఆదరణ దక్కించుకున్న ‘బిగ్ బాస్’ షోగా తెలుగు రియాలిటీ షో గుర్తింపు తెచ్చుకుంది. ఒక ఓటీటీ వెర్షన్ కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. త్వరలోనే 8వ సీజన్ ప్రసారానికి రెడీ అవుతోంది. ఈ షోలకు ఓసారి జూనియర్ ఎన్టీఆర్, మరోసారి నాని హోస్టులుగా చేయగా, 5 సార్లు నాగార్జున హోస్టుగా వ్యవహరించారు.  ఈ సారి కూడా ఈ షోను నాగార్జున నడిపించబోతున్నారు.






‘బిగ్ బాస్’ 8పై భారీగా అంచనాలు పెంచిన టీజర్


‘బిగ్ బాస్’ 8వ సీజన్ కు సంబంధించి ఇప్పటికే లోగోతో పాటు టీజర్ ను నిర్వాహకులు విడుదల చేశారు. హోస్టు నాగార్జున, కమెడియన్ సత్య కలిసి చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  అంతేకాదు, ఎనిమిదో సీజన్ మీద అంచనాలు పెరిగేలా చేశాయి. తాజాగా విడుదలైన ప్రోమో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ‘బిగ్ బాస్’ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి ప్రేక్షకుల ముందుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ షో ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఇన్ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఈ షోను కొనసాగించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అటు ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో వాస్తవం ఎంత అనేది త్వరలో తెలియనుంది.   



Read Also: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘కమిటీ కుర్రోళ్ళు’- రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?