నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రేపు (జనవరి 21వ తేదీ) ఓటీటీలో విడుదల కానుంది. జనవరి 21వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.


డిసెంబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా సరిగ్గా 50 రోజుల తర్వాత హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు మూడు నుంచి నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుండగా.. అఖండ మాత్రం 50 రోజుల తర్వాత స్ట్రీమ్ కావడం విశేషమే.


బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, నితిన్ మెహతా విలన్లుగా నటించారు. ఈ సినిమా రూ.150 కోట్ల వరకు గ్రాస్‌ను వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. నాన్ థియేట్రికల్ రెవిన్యూని కూడా కలుపుకుని ఏకంగా రూ.200 కోట్ల వరకు బిజినెస్ ఈ సినిమా చేసిందని తెలుపుతూ దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.


అఘోరాగా బాలకృష్ణ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. వారం, రెండు వారాలకే థియేటర్ రన్ పూర్తయిపోతున్న ఈ రోజుల్లో కూడా 103 కేంద్రాల్లో అఖండ 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతికి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేయడం విశేషం. ఇప్పుడు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా మరింత మందికి ఈ సినిమా చేరువకానుంది.