2021లో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమాల్లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో డబ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో విడుదల చేయనుంది. జనవరి 20వ తేదీన హిందీ థియేటర్లలో అఖండ డబ్ వెర్షన్ సందడి చేయనుంది.


దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. హిందూత్వం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ-2’ సూపర్ హిట్ అయింది కాబట్టి ‘అఖండ’ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోయిజం ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు హిందీలో బ్రహ్మరథం పడుతున్నారు. ‘అఖండ’లో బోయపాటి, బాలయ్య మాస్ కాంబినేషన్‌కు థమన్ అదిరిపోయే రీ-రికార్డింగ్ తోడయింది.


ఇక తెలుగునాట కూడా సంక్రాంతికి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’తో పలకరించనున్నారు. క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' రికార్డును 'అఖండ' విడుదల అయిన పది రోజుల్లోనే క్రాస్ చేసింది. బాలకృష్ణకు తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. 'అఖండ'తో నట సింహ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.