నందమూరి బాలకృష్ణ అరుదైన రికార్డును సాధించారు. తొలిసారి ఆయన నటించిన సినిమా వంద కోట్ల గ్రాస్ ను సాధించింది. డిసెంబర్ 2న బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా పది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ ను అందుకొని సత్తా చాటింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్ లో ఆయన హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమా అంటే 'గౌతమీపుత్ర శాతకర్ణి' అని చెప్పుకునేవారు. కానీ 'అఖండ' సినిమా తొలివారంలోనే ఆ సినిమా కలెక్షన్స్ ను దాటేసి ఆశ్చర్యపరిచింది. 


ఇప్పుడు ఏకంగా సెంచరీ మార్క్ ను టచ్ చేసింది. నిజానికి నైజాంలో బాలయ్య సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా ఉండవు.. అలాంటిది ఆ ఏరియాలో ఈ సినిమా రూ.26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్రా, రాయలసీమ కలిపి రూ.50 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియాలో మిగిలిన ప్రాంతాలు, అలానే ఓవర్సీస్ కలిపి ఈ సినిమా మొత్తంగా పాతిక కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అంటే.. ఓవరాల్ గా ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను అందుకుంది. 


సినిమా షేర్ కూడా రూ.60 కోట్లకు దగ్గరగా ఉంది. తొలివారంలోనే ఈ సినిమా రూ.80 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఈ వారం విడుదలైన ఏ సినిమాలు కూడా ప్రభావం చూపకపోవడంతో 'అఖండ' సినిమాకి మరిన్ని వసూళ్లు యాడ్ అవుతున్నాయి. రెండో వారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 'అఖండ' సినిమాకి ముందు బాలయ్య మార్కెట్ అంతంతమాత్రంగా ఉండేది. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గింది. కానీ 'అఖండ' సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు బాలయ్య. తొలిసారి ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు బాలయ్య.