తమిళ స్టార్ హీరో అజిత్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాలు ఒక్కటే కాదు, పలు రంగాల్లో ఆయన మంచి ప్రావీణ్యత కలిగి ఉన్నారు. బైక్ రేసింగ్ అంటే ఎంతో మక్కువ. రైఫిల్ షూటింగ్ లోనూ పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా రైఫిల్ షూటింగ్స్ లో పాల్గొంటారు. అవకాశం చిక్కినప్పుడల్లా బైక్ మీద సాహసయాత్రలు చేస్తుంటారు. ఈ మధ్యే నెల రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు నేపాల్, భూటాన్ లోనూ బైక్ మీద పర్యటించారు. అక్కడి స్థానికులతో మాట్లాడుతున్న ఫోటోలు సైతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
అజిత్ ప్రపంచ యాత్రపై మేనేజర్ కీలక ప్రకటన
తాజాగా అజిత్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. త్వరలో బైక్ మీద ప్రపంచ యాత్రకు బయల్దేరబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ సురేష్ చంద్ర ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "అజిత్ ఇప్పటికే బైక్ మీద ఎన్నో సాహసయాత్రలు చేశారు. సవాళ్లతో కూడిన భూభాగాల్లో ప్రయాణించి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ నేపాల్, భూటాన్ ను కూడా కవర్ చేశారు. ఆయన తదుపరి దశ ప్రపంచ పర్యటన నవంబర్ 2023లో ప్రారంభమవుతుంది" అని సురేష్ చంద్ర తెలిపారు.
నవంబర్ లో అజిత్ ప్రపంచ యాత్ర షురూ!
వాస్తవానికి అజిత్ ‘రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్’ టూర్ ని చాలా నెలల కిందటే ప్రారంభించారు. తన విలువైన ద్విచక్ర వాహనం మీద వేల కిలోమీటర్లు ప్రయాణించారు. నటి మంజు వారియర్ సైతం అతడితో కలిసి కొంత మేర ప్రయాణం చేసింది. ఇక నవంబర్‌లో మళ్లీ ప్రారంభం కానున్న ‘రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్’ చివరి దశలో భాగంగా, అజిత్ ప్రపంచ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఏడు ఖండాల్లోని అన్ని ముఖ్యమైన నగరాల్లో దాదాపు ఏడాదికపైగా ఈ టూర్ కొనసాగనుంది. ఈ ప్రయాణం 62 దేశాల్లోని రాజధానులతో పాటు ముఖ్య నగరాలను టచ్ చేస్తూ ముందుకు సాగనుంది. ఈ నేపథ్యలో అజిత్ సుమారు ఏడాదిన్నర పాటు సినీ ప్రపంచానికి దూరంగా ఉండనున్నారు. అజిత్ కు సంబంధించిన ఈ చారిత్రాత్మక ప్రయాణంపై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'విదా ముయార్చి' షూటింగ్ తర్వాతే ప్రపంచ యాత్ర!
ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే తన 62వ చిత్రం 'విదా ముయార్చి' షూటింగ్ ఈ ఏడాది జూన్ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా నీరవ్ షా, డిజైనర్ గా గోపీ ప్రసన్న బాధ్యతలను నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అజిత్ ప్రపంచ యాత్రను ప్రారంభం కానుంది.
Also Read : 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?