AK Moto Ride : తమిళ హీరో తలా అజిత్ కుమార్.. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించారు. సైకిళ్లు, కార్లు, హెలికాప్టర్లు లాంటి వివిధ వాహనాలపై అత్యంత ఆసక్తి ఉన్న ఆయన.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా బైక్ టూర్ లు చేస్తున్నారు. సినిమా షూటింగ్ ల గ్యాప్ లో తరచుగా మోటార్ సైకిల్ రైడింగ్ చేస్తూ ఇప్పటికే పలుసార్లు కనిపించారు. అంతే కాదు ఆయన ప్రయాణించిన దూరాన్ని, దానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన టీం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంది.
తాజాగా ఈ నటుడు ఏకే మోటో రైడ్ అనే అంతర్జాతీయ మోటార్ సైకిల్ టూరింగ్ కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా ఆసక్తిగల రైడర్లు, సాహస ప్రియులు, భారతదేశంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను మాత్రమే కాకుండా అన్యదేశ అంతర్జాతీయ రహదారులను కూడా అన్వేషించే పర్యటనలను ఆస్వాదించవచ్చని ఓ ప్రకటన ద్వారా అజిత్ తెలియజేశారు. అంతే కాకుండా ఈ కంపెనీ ద్వారా దేశంలోని తరచూ బైక్ అడ్వెంచర్ టూర్‌లను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ప్రకృతి అందాలను వెలికి తీయగలుగుతామని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా- అంతర్జాతీయ రోడ్లపైనా రయ్యి మంటూ దూసుకెళ్లే అవకాశాన్ని బైక్ రైడర్స్‌కు కల్పిస్తామని ఈ ప్రకటనలో ఆయన వివరించారు.
ఎంథూసియాస్ట్స్‌లకు చక్కని అవకాశం
బైక్ రైడింగ్ పట్ల తనకు ఉన్న అభిరుచిని ప్రొఫెషన్‌గా మార్చుకున్నానని అజిత్ చెప్పారు. తనలాగే బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే వారికోసం ఏకే మోటో రైడ్ ద్వారా బైక్ రైడర్స్, అడ్వెంచర్స్ ఎంథూసియాస్ట్స్‌లకు ఇదో చక్కని అవకాశాన్ని కల్పించదలచుకున్నట్లు అజిత్ కుమార్ చెప్పారు. వాస్తవ జీవితానికి, బైక్ రైడింగ్‌కు దగ్గరి సంబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
భద్రత, సౌకర్యం..
జీవితం కూడా ఓ అందమైన రైడ్ లాంటిదేనని అజిత్ అన్నారు. బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే అనుభవాల మాదిరిలాగానే జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బైక్‌పై లాంగ్ డ్రైవ్, అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి తగిన భద్రత, సౌకర్యాలను కల్పించడంలో ఏకే మోటో రైడ్ నిబద్ధతతో పని చేస్తుందని అజిత్ హామీ ఇచ్చారు. అలాంటివారికి అడ్వెంచర్ టూరింగ్ సూపర్‌బైక్‌లను అందిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రొఫెషనల్ గైడ్స్ ఆధ్వర్యంలో..
బైక్ టూర్‌లో అనుభవం ఉన్న వారిని ప్రొఫెషనల్ గైడ్‌గా అపాయింట్ చేశామని, ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, స్థానిక ఆచార వ్యవహారాలు, సంస్కతి సంప్రదాయాల గురించి విస్తృతమైన పరిజ్ఞానం ఉన్న వారిని గైడ్స్‌గా సెలక్ట్ చేశామని అజిత్ కుమార్ స్పష్టం చేశారు. కాగా ఒక్కో అడ్వెంచర్ టూరిజానికి ఎంత ఛార్జీని కలెక్ట్ చేస్తారన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.
అజిత్ కుమార్ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న 'విదా ముయార్చి'లో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'మేఘమాన్' (2014), 'తాడం'(2019) ఫేమ్ దర్శకుడు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అజిత్ తన నెక్స్ట్ బైక్ టూర్ ఏకే వరల్డ్ రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫేజ్ ను నవంబర్ 2023లో తిరిగి ప్రారంభించనున్నారు.
Read Also : విక్రమ్‌తో సినిమా చేయాలనుకున్నా, స్పందించకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా- అనురాగ్ కశ్యప్