మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. పనామా పత్రాల వ్యవహారంలో ప్రశ్నించేందుకు ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ఐశ్వర్యను ప్రశ్నించినట్లు సమాచారం.
అయితే ఇంతకుముందే ఐశ్వర్య రాయ్ హాజరుకావాల్సి ఉండగా వాయిదా వేయాలని ఈడీని కోరింది. ఈసారి మాత్రం ఆమె తప్పక హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఆమెను విచారించనుంది ఈడీ.
500 మందిలో..
ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనామా పేపర్ల కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈడీ అధికారులు దేశంలోని పలువురు ప్రముఖులను విచారణలో చేర్చారు. అందులో భాగంగా నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేయగా అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్ కొన్ని పత్రాలను అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌కు సమన్లు జారీ చేసింది.
ఏంటీ పనామా పేపర్లు..
పన్నుల స్వర్గధామంగా పేర్కొనే కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, అత్యంత ధనికులు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు. ఆయా దేశాల బ్యాంకుల్లో తమ నగదును దాచుకున్నారు. ఫలితంగా స్వదేశానికి చెల్లించాల్సిన పన్నులను భారీగా ఎగ్గొట్టారు. ఈ విషయం 'పనామా పేపర్స్' లీక్ అవ్వడం ద్వారా ప్రపంచానికి తెలిసింది.
పనామా చట్ట సంస్థ మొస్సాక్ ఫోన్సెకా నుంచి భారీగా లీక్ అయిన ఈ పత్రాలను దక్షిణ జర్మన్ వార్తాపత్రిక ప్రపంచానికి తెలిపింది. ఫలితంగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన తమ దేశస్థుల నుంచి జర్మనీ 183 మిలియన్ డాలర్ల విలువైన పన్నులు వసూలు చేసింది. మిగిలిన దేశాలూ అదే బాట పట్టాయి.
Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి