అడివి శేష్ హీరోగా 2018లో విడుదలైన ‘గూఢచారి’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘G2’ సినిమాను ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ-విజన్ వీడియోను సోమవారం విడుదల చేశారు. మొదటి భాగం చివర్లో వచ్చే విజువల్స్‌కు రెండో భాగం ఫస్ట్‌లుక్‌ను జోడించారు. ఫస్ట్‌లుక్ చూస్తే మొదటి భాగం కంటే చాలా భారీ బడ్జెట్‌తో ఈ రెండో భాగాన్ని రూపొందించనున్నట్లు అర్థం అవుతుంది.


కొత్త దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘G2’ విడుదల కానుంది. మొదటి భాగానికి సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సీక్వెల్‌లో కూడా కొనసాగనున్నాడు. సినిమాలో నటీనటులు, టెక్నికల్ క్రూ గురించి ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు. అలాగే 2023లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నామని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఎప్పుడు విడుదల కానుందో మాత్రం తెలియరాలేదు.


దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు ఇటీవలే ప్రారంభం అయినట్లు అడివి శేష్ ఇటీవలే తెలిపాడు. ‘హిట్ 2’ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాకనే గూఢచారి సీక్వెల్ రాయడం ప్రారంభిస్తానని చెప్పాడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు.


2022లో అడివి శేష్ రెండు హిట్లు అందుకున్నాడు. జూన్‌లో ‘మేజర్‌’గా వచ్చి పాన్ ఇండియా హిట్ కొట్టిన శేష్, డిసెంబర్‌లో ‘హిట్ 2’తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం శేష్ చేతిలో ‘గూఢచారి 2’ మాత్రమే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో భారీ పాన్ ఇండియా సినిమా ఒకటి ప్లానింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఈ సినిమాను నిర్మించే బ్యానర్లు గతంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్స్ అందించారు. ఇక ‘మేజర్’ సినిమాతో అడివి శేష్‌కు కూడా పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి భారీ బడ్జెట్‌తో నిర్మాతలు సాహసం చేస్తున్నారని అనుకోవచ్చు. సినిమా స్కేల్ ఏ రేంజ్‌లో ఉండనుంది? కొత్తగా ఎవరు కనిపించనున్నారు? అనే విషయాలు తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.