విభిన్న సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’. దీని టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. టీజర్‌ను బట్టి చూస్తే ఈ సిని హనుమంతుని శక్తిని పొందే ఒక యువకుడి కథగా కనిపిస్తుంది. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ వీఎఫ్ఎక్స్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే కొంతమంది ‘ఆదిపురుష్’ కంటే ‘హనుమాన్’లో వీఎఫ్ఎక్స్‌నే బాగుందని అభిప్రాయపడుతున్నారు.


ఈ టీజర్‌లో హీరో తేజ సజ్జ హనుమంతుని అవతారంలా కనిపిస్తున్నాడు. రౌడీలను గాల్లోకి ఎగరేయడం, రాత్రిపూట ఆకాశంలో దూకుతున్నట్లు విజువల్స్, ఒక అడవిలో పెద్ద హనుమాన్ విగ్రహం షాట్లను కూడా ఈ టీజర్‌లో చూడవచ్చు.


నెటిజన్ల నుంచి టీజర్‌కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్విటర్ వేదికగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


చాలా మంది ఆడియన్స్ ‘హనుమాన్’ వీఎఫ్ఎక్స్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అది ఆదిపురుష్ కంటే మెరుగ్గా ఉందన్నారు. ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల అయ్యాక దాని వీఎఫ్ఎక్స్‌పై భారీగా నెగిటివిటీ వచ్చింది.


జాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు సినిమా ‘అ!’ దర్శకుడు ప్రశాంత వర్మనే. తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’, తేజ సజ్జ హీరోగా ‘జాంబీ రెడ్డి’ సినిమాలను కూడా ఆయన తెరకెక్కించారు. ‘జాంబీ రెడ్డి’ తర్వాత నుంచి ప్రశాంత వర్మ ఈ సినిమా మీదనే పని చేస్తున్నారు.


ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది మొదటి సినిమా అని తెలిపాడు. ఈ ఫ్రాంచైజీలో ‘అధీర’ అనే సినిమాతో పాటు లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పాడు. అవన్నీ ‘హనుమాన్’ తర్వాత మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. ‘హనుమాన్’ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.