ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రమోషన్ వీడియోలు, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం అలరించింది. టీజర్, ట్రైలర్‌లో డైలాగ్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. యూట్యూబర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి, ‘బేబీ’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ వైష్ణవీ చైతన్య  ‘బేబీ’ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది.


నా గురించి చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి!


హీరోయిన్ కావాలనే తన కోరిక  సుమారు 8 సంవత్సరాల తర్వాత నెరవేరిందని వైష్ణవి చెప్పింది. “ హీరోయిన్ కావాలని  ఇండస్ట్రీకి వచ్చాను. నా ప్రయాణం మొదలై 8 ఏండ్లు అవుతుంది. ఇప్పుడు ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.  నా మీద నాకు నమ్మకం ఉంచి దర్శకుడు సాయి రాజేష్  ఈ అవకాశం ఇచ్చారు. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. కానీ, వాటిని దాటుకుని ముందుకు వచ్చాను” అని చెప్పింది.


కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది!


ఇక ‘బేబీ’ సినిమాలో బస్తీ అమ్మాయిగా నటించినట్లు వైష్ణవి చెప్పింది. “’బేబీ’ సినిమాలో నాది  బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి క్యారెక్టర్. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. చాలా డెప్త్ ఉన్న సీన్లు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ ప్రెజర్ అని ఫీల్ అవ్వలేదు. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి ఈ పాత్రను చేశాను” అని చెప్పుకొచ్చింది.  


ఈ సినిమా మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది!


“ఈ సినిమా చూస్తే మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మధురానుభూతిలా మిగిలిపోతుంది. ఈ సినిమాతోనూ అదే చెప్పబోతోన్నాం” అని చెప్పింది.  


ఆ ప్రచారం ఎందుకు జరిగిందో తెలియదు!


“తెలుగు అమ్మాయిలకు ఛాన్స్‌ లు ఇవ్వరనే మాట, ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలీదు. అలా ఏం ఉండదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను” అని వైష్ణవి వివరించింది. ప్రస్తుతం తాను ఏ సినిమాను అంగీకరించలేదని చెప్పింది. ఈ సినిమా తర్వాత తన గురించి అందరికీ తెలిసే అవకాశం ఉందని వైష్ణవి చెప్పుకొచ్చింది.  






Read Also: సీఎస్‌కే‌ టీమ్‌లో చేర్చుకోమన్న కమెడియన్ యోగిబాబు - ధోనీ రిప్లై అదుర్స్


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial