Actress Shivani Rajashekar On Glamour Roles:  సీనియర్ నటులు జీవిత, రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాని, వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా రాహుల్ విజయ్ తో కలిసి 'కోటబొమ్మాళి పీఎస్' అనే సినిమాలో నటిస్తున్నది. ఈ మూవీలో సీనియర్ నటుడు శ్రీకాంత్,  అందాల తార వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు  చేస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్- 2 పతాకంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టు ప్రొడక్ష్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ శివాని రాజశేఖర్ 'కోటబొమ్మాళి పీఎస్' మూవీతో పాటు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.   


ఈ సినిమా కోసం  శ్రీకాకుళం యాస నేర్చుకున్నా- శివాని


ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది శివాని. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌ మూవీలో నా నటన చూసి దర్శకుడు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది. “'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో గిరిజన అమ్మాయిగా నటించాను. నా నటన దర్శకుడు తేజకు బాగా నచ్చింది. ఈ సినిమాలోనూ ఇంచుమించు అలాంటి పాత్రే కావడంతో నన్ను సంప్రదించారు. తమిళ చిత్రం ‘నాయట్టు’కు తెలుగు రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. మూల కథలో మార్పులు లేకుండా తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు చాలా మార్పులు చేశారు. ఇందులో నేను కానిస్టేబుల్ పాత్రలో నటించాను. మానాన్న పోలీస్ సినిమాల నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఇందులో నటించాను. నాన్న కూడా తన క్యారెక్టర్ కోసం కొన్ని సూచనలు చేశారు” అని వెల్లడించింది. 


‘లింగిడి’ పాటతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది- శివాని   


ఇక ఈ సినిమాలోని ‘లింగిడి’ అనే పాట బాగా పాపులర్ కావడం పట్ల శివాని సంతోషం వ్యక్తం చేసింది. ఈ పాటతో   సినిమాతో పాటు తనకూ మంచి  క్రేజ్ వచ్చిందని చెప్పింది. “నేను ఎక్కడికి వెళ్లినా చాలా మంది ‘లింగిడి‘ పాట గురించి అడుగుతున్నారు.  ఈ పాట ఇంతగా పాపులర్ కావడానికి కారణం అయిన మ్యూజిక్ డైరెక్టర్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. సీనియర్ నటుడు శ్రీకాంత్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. మా డాడీతో చాలా క్లోజ్ గా ఉంటారు. ఆయనతో కలిసి తొలిసారి నటించడం చాలా గొప్పగా ఫీలయ్యా. ఆయన మాతో చాలా సరదగా ఉండేవారు. ఆయన దగ్గరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటనకు అందరూ ఫిదా అవుతారు” అని చెప్పింది.


గ్లామరస్ పాత్రల కోసం వెయిట్ చేస్తున్నా- శివాని


ప్రస్తుతానికి తాను గ్లామరస్ పాత్రల గురించి ఆలోచించడం లేదని చెప్పింది శివాని. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. “ప్రస్తుతం నేను గ్లామరస్ పాత్రల గురించి ఆలోచించడం లేదు. నా చేతిలో ఉన్న సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాను. గ్లామరస్ క్యారెక్టర్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం ఎదురు చూస్తున్నాను. నా సినిమా కథల విషయంలో అమ్మానాన్న ఎలాంటి జోక్యం చేసుకోరు. నేను నిర్ణయం తీసుకుంటాను” అని శివాని వెల్లడించింది.


Read Also: ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే స్ట్రీకింగ్ చేస్తా, షాకింగ్ ఆఫర్ ఇచ్చిన తెలుగు బ్యూటీ