‘‘ఈ భూగ్రహం మీద మనిషి చాలా చిన్న జీవి. తను బతికేది మహా అయితే 80 ఏళ్లు. ఈ జీవితం కోసం ఎంతో స్వార్థం, మరెంతో మోసకారితనంతో వ్యవహరించే వారు ఎంతో మంది. కొంత మంది స్నేహం కేవలం అవసరాల కోసం మాత్రమే అనేలా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారి స్నేహం ఉన్న ఫర్వాలేదు, లేకున్నా ఫర్వాలేదు’’ అంటోంది అందాల తార సదా. తాజాగా ఈమె ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అటవీ ప్రాంతంలో వన్యమృగాలను చూసేందుకు వాహనంలో వెళ్తూ.. ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. "When your intentions are pure, you don't lose people, they lose you." అనే క్యాప్షన్ పెట్టి ఓ పోస్టు రాసింది.

  


కేవలం అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న స్నేహాలు, బంధాలు ఏ వ్యక్తికీ మంచిది కాదు. అలాంటి స్నేహాల్లో, బంధాల్లో చిక్కి కొంత మంది విలవిలాడుతుంటారు. కానీ, ఆయా బంధాల గురించి బాధ పడాల్సిన అవసరం లేదు. అలాంటి స్నేహితులు దూరం అయ్యారని చింతించాల్సిన పని లేదంటోంది సదా. మనతో అవసరాల కోసం స్నేహం చేసే వారిని ఎంత దూరం చేసుకుంటే అంత మంచింది. అలాంటి వారితో బంధాలను తగ్గించుకోవడమే ఉత్తమం. మన జీవితంలోకి చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్లంతా శాశ్వతం కాదు. మనకు మనమే శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని పేర్కొంది.   


అనవసర వ్యక్తుల కారణంగా మీ జీవితాన్ని చిందరవందర చేసుకోకండి. మీకు నచ్చిన వారితో మాత్రమే స్నేహం చేయడానికి ప్రయత్నించండి. నచ్చని వ్యక్తులకు దూరంగా ఉండండి. మనం ఎదుటి వారి సంతోషం కోసం ప్రయత్నించినా, వారు మనకు చెడు చేసేందుకే ప్రయత్నించే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులతో జాగ్రత్తగా ఉండండి. ప్రజలను సంతోష పెట్టడం ద్వారా మనం సంతోషంగా ఉంటాం అనుకోడం కొన్నిసార్లు తప్పే అవుతుంది. మీరు మంచి వ్యక్తి అనుకున్న వారు కూడా ఒక్కోసారి మీకు కీడు తలపెట్టే అవకాశం ఉంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు మన ఇంటిని శుభ్రం చేసే సమయంలో పనికి రాని వస్తువులను ఎలా బయట పడేస్తామో.. అలాగే మన స్నేహానికి సరిపడని వ్యక్తులను కూడా దూరంగా ఉంచడం మంచింది. మన జీవితం చాలా చిన్నది. తప్పుడు విషయాలతో వృథా చేసుకోవద్దు. చెడ్డవారితో కలిసి ఉండటం కన్నా, ఒంటరిగా ప్రశాంతంగా ఉండటం మంచిదంటోంది సదా.





Read Also: ఓటీటీలోకి ‘సీతారామం‘, హిందీలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?