మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో తాజాగా జరిగిన 12 ఏండ్ల బాలిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దారుణ అత్యాచారానికి గురైన అమ్మాయి, నడి వీధిలో బట్టలు లేకుండా, రక్తం కారుతున్న ఒంటితో సాయం కోసం ప్రాధేయపడిన విజువల్స్ ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. ఈ ఘటనపై దేశ వ్యాపంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపించాయి.  


బాలికలకు ఆ ట్రైనింగ్ అవసరం- రితికా సింగ్


తాజాగా నటి రితికా సింగ్ ఉజ్జయి ఘటనపై స్పందించింది. దేశంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. “దేశంలో ప్రతి రెండు గంటలకు ఏదో ఒక మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్న పిల్లలపై లైగింగ్ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. న్యూస్ లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా ఒంట్లో రక్తం మరుగుతూనే ఉంది. ఈ దారుణాలు ఇంకా ఎప్పుడు ఆగుతాయో? అనిపిస్తుంది. ఇలాంటి అఘాయిత్యాలు ఆగాలంటే, మహిళలలు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, ప్రతి అమ్మాయికి సెల్ఫ్‌ డిఫెన్స్‌ తో పాటు మార్షల్ ఆర్ట్స్‌ లో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.  ఇలాంటి దాడుల గురించి అమ్మాయిలకు ముందుగానే అవగాహన కల్పించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో చెప్పాలి. చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. చిన్న పిల్లలకు లైంగిక దాడుల గురించి చెప్పాలంటే ఇబ్బంది అయినా, తప్పదు. వారి భవిష్యత్ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి” అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.     






క్రీడారంగం నుంచి సినిమా రంగంలోకి


రితికా సింగ్ కిక్ బాక్సర్ గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుది సుట్రు’లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాను తెలుగులో ‘గురు’, హిందీలో ‘సాలా ఖడూస్‌’గా రీమేక్‌ చేశారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది రితికా. ఆ తర్వాత  ‘శివలింగ’, ‘నీవెవరో’, ‘ఓ మై కడవులే’, ‘ఇన్కార్‌’ సినిమాల్లో నటించింది. ‘స్టోరీ ఆఫ్‌ థింగ్స్‌’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, తాజాగా  దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘కింగ్‌ ఆఫ్‌ కొత్తా’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక  రితికా సింగ్ మిక్స్డ్ మార్స‌ల్ ఆర్స్ట్ లో ట్రైనింగ్ పొందింది. చిన్న వయసు నుంచే మార్ష‌ల్ ఆర్స్ట్ లో మెళకువలు నేర్చుకుంది. దీంతో 'గురు' సినిమాలో బాక్స‌ర్ పాత్ర‌ పోషించే అవకాశం కలిగింది. ఈ సినిమా తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి.


Read Also: వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial