Actress Kushboo Mistakenly Sharing Pic Of Maldives: ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటన సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రధాని పర్యటన పట్ల మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. పలువురు సెలబ్రిటీలు సైతం భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు. మన దేశంలోనూ మాల్దీవులకు మించిన అద్భుత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటికి సపోర్టు చేయాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.


లక్షద్వీప్ కు బదులు మాల్దీవుల ఫోటో షేర్ చేసిన ఖుష్బూ


తాజాగా ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా లక్షద్వీప్ కు మద్దతు తెలిపారు. “ల‌క్ష్వదీప్‌కి చాలా సార్లు వెళ్లాను. దాని సహజ సౌందర్యానికి మంత్రముగ్ధురాలిని అయ్యాను. క్రిస్టల్ క్లియర్ వాటర్స్. స్నార్కెలింగ్, స్పీడ్ జెట్ బోట్ రైడ్‌లు, సముద్రంలో తేలుతూ, ఈత కొట్టే అందమైన రంగురంగుల చేపలను చూడటం నిజంగా అద్భుతం అనిపిస్తుంది. త్వరలో మళ్లీ లక్షదీప్‌కి వెళ్లాలని భావిస్తున్నాను. మాల్దీవులతో పోల్చితే తక్కువ ఖర్చుతో లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. లక్షద్వీప్ టూరిజంను డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు” అని రాసుకొచ్చారు. అయితే, ఆమె ట్వీట్ బాగానే ఉన్నా, పోస్టు చేసిన ఫోటోల్లో ఒకటి మాత్రం మాల్దీవులు పిక్ ఉంది. ఈ పిక్ చూసి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. మాల్దీవులు ఏదో, లక్షద్వీప్ ఏదో ముందు తెలుసుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.






రణవీర్ పోస్టుపై నెటిజన్ల ట్రోలింగ్


అటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా ఇలాంటి తప్పే చేశారు. సోషల్ మీడియాలో లక్షద్వీప్‌ ను ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన పోస్టుపై నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ఏడాదిలో లక్షద్వీప్‌ కు వెళ్లాలి అనుకుంటున్నట్లు చెప్పారు. భారతీయ సంస్కృతిని ప్రోత్సాహించాలని అభిమానుల్ని కోరారు. ‘‘ఈ ఏడాది భారత్ ను అన్వేషిద్దాం. మన సంస్కృతి అనుభూతిని ఆస్వాదిద్దాం. మన దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, బీచ్ లు ఉన్నాయి.  ఛలో ఇండియా లెట్స్ #exploreindianislands’’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్టులో మాల్దీవుల ఫోటోని షేర్ చేశారు. లక్షద్వీప్ ఫోటోకి బదులుగా మాల్దీవుల ఫోటోని షేర్ చేయడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆ రెండు ప్రాంతాలకు తేడా తెలియదా? అని కామెంట్స్ మొదలు పెట్టారు. ఈ ట్రోల్స్ ను గమనించిన రణవీర్ వెంటనే పోస్టును డిలీట్ చేశారు. మరోసారి ఎలాంటి ఫోటో లేకుండా ట్వీట్ చేశారు.   


అటుబాయ్‌కాట్ మాల్దీవుల ట్రెండ్‌లో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్‌లతో పాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వెంకటేష్ ప్రసాద్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్వీట్స్ చేశారు. మాల్దీవులకు వెళ్లకుండా భారత్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కోరారు.


Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం