Actress Hansika Motwani On Tollywood: ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘మస్కా’, ‘కందిరీగ’ లాంటి సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు మరింత చేరువయ్యింది. కొంతకాలం పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ప్రస్తుతం‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కించిన ఈ మూవీ నేడు (నవంబర్ 17) విడుదల అయ్యింది. ఈ సందర్భంగా పలు విషయాలను  వెల్లడించింది హన్సిక.


సరికొత్త కథతో తెరకెక్కిన ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’


‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ చిత్రంతో కొత్త విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు హన్సిక తెలిపింది. డార్క్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు వెల్లడించింది. ఇప్పటి మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా గురించి సినిమాలు వచ్చాయని, తొలిసారి మానవ చర్మం అక్రమ రవాణా గురించి ఈ చిత్రంలో చూపించినట్లు వెల్లడించింది. మానవ చర్మం అక్రమ రవాణా ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? దీని వెనుకున్న వ్యక్తులు ఎవరు? అనేది ఇందులో చూపించినట్లు చెప్పింది. ఈ సినిమాలో యాడ్ ఏజెన్సీలో పని చేసే శృతి అనే అమ్మాయి పాత్రలో నటించినట్లు వివరించింది. చర్మ మాఫియా ట్రాప్ లో పడిన తాను, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది ఈ చిత్రంలో చూడాలని చెప్పింది.    


అందుకే తెలుగు సినిమాలకు గ్యాప్ వచ్చింది- హన్సిక


ఇక తెలుగు సినిమా పరిశ్రమకు కొంతకాలంగా దూరంగా ఉండటంపైనా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టాలీవుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయేనని వివరించింది. కొద్ది కాలంగా తమిళ సినిమా పరిశ్రమలో బిజీగా ఉన్నట్లు చెప్పింది. అందుకే తెలుగు సినిమాల విషయంలో కొంత గ్యాప్ వచ్చినట్లు వెల్లడించింది. ఇకపై తెలుగు సినిమాల్లో  తరచుగా కనిపిస్తానని చెప్పింది.


నా సంతృప్తి అదొక్కటే- హన్సిక


రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎప్పుడూ, దేని గురించి తాను బాధ పడిన సందర్భం లేదని హన్సిక చెప్పింది. అవకాశాలు వచ్చినా, రాకున్నా ఒకేలా ఉన్నట్లు వివరించింది. నటన పరంగానే తాను సంతృప్తి చెందలేదని వెల్లడించింది. రానున్న సినిమాలో మంచి క్యారెక్టర్లు చేయాలని ఉందని చెప్పింది. కెరీర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేయడం పట్ల గొప్పగా ఫీలవుతున్నట్లు తెలిపింది. వారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజికి చేరడం గర్వంగా ఉందని చెప్పింది. వాళ్లు ఏ స్థాయికి చేరుకున్న ఇప్పటికీ ఎంతో వినయంగా ఉండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం‘105 మినిట్స్‌’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్‌’ సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పింది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు హన్సిక వెల్లడించింది.


Read Also: గ్లామర్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నా, నటి శివాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్