Actress Divya Vani: తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో అద్భుత పాత్రలు పోషించారు నటి దివ్యవాణి. బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె, ఆ తర్వాత హీరోయిన్ గా మారి సూపర్ హిట్ సినిమాలు చేసింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సర్దార్ కృష్ణమనాయుడు’లో కృష్ణ కూతురిగా వెండితెరకు పరిచయం అయ్యారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెళ్లి పుస్తకం’ సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో సింగిల్ టేక్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు.


సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దివ్యవాణి


దివ్యవాణి పెళ్లికి ముందు సుమారు 30 చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పలు సినిమాలు చేశారు. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన సుబ్రమణ్యంను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దశాబ్దం పాటు సినిమాలకు దూరం అయ్యారు. అనంతరం ‘రాధాగోపాలం’ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ‘మహానటి’తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. పలు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


క్రిస్టియానిటీలోకి మారడానికి కారణం చెప్పిన దివ్యవాణి


ఆ తర్వాత దివ్యవాణి క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయ్యారు. అయితే, దాని వెనుక ఓ కారణం ఉందని ఆమె తాజాగా వెళ్లడించారు. తన బాబుకు చిన్నప్పటి నుంచే ఆరోగ్యం సరిగా ఉండేది కాదని చెప్పారు. ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా డాక్టర్లు బాగానే ఉన్నాడు అని చెప్పేవారని వివరించారు. కానీ, తన ఆరోగ్యం రోజు రోజుకు మరింత క్షీణించించేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాబు స్కూల్ టీచర్ క్రిస్టియానిటీని నమ్ముకోవాలని చెప్పడంతో తను అటువైపు అడుగులు వేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత బాబు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్లు చెప్పారు. ప్రస్తుతం తను సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు వివరించారు. నిజానికి కమ్మ కులంలో పుట్టిన తాను శ్రీ వేంకటేశ్వర స్వామికి అపర భక్తురాలిగా ఉండేదాన్ని అని చెప్పుకొచ్చారు. కానీ, ఆ తర్వాత తాను ఏసును నమ్ముకొవాల్సి వచ్చిందన్నారు.  


కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న దివ్యవాణి


ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంది దివ్యవాణి. తాజాగా ఆమె టీడీపీ నుంచి తెలంగాణ కాంగ్రెస్‌‌లో చేరారు. దివ్యవాణికి  ప్రస్తుతం పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. చంద్రబాబు దగ్గర పనిచేయడం ఆనందంగా ఉన్నప్పటికీ, కొన్ని కారణాలతో టీడీపీని వీడానని దివ్యవాణి చెప్పారు. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌‌లో పనిచేయడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానన్నారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్‌‌తోనే సాధ్యం అని, పార్టీకి అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేశారు. టీడీపీ మహానాడు వేదిక పైన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.    


Read Also: కాస్త ఓపిక పట్టండి - నెక్ట్ట్స్ మూవీపై యష్ రియాక్షన్ ఇదే!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply