తాజాగా తమిళ నటుడు విశాల్ ముంబై CBFCపై చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాను నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా హిందీ సెన్సార్ షిప్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆధారాలతో సహా బయటపెట్టారు. ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC)లోని పలువురు అధికారులకు ఎంత ఎంత ముట్టజెప్పాల్సి వచ్చిందో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్పెషల్ వీడియో ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. సెన్సార్ బోర్డు సభ్యులపై చర్చలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు విజ్ఞప్తి చేశారు. విశాల్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఈ ఘటనపై ప్రత్యేక అధికారితో దర్యాప్తు జరిపించింది. లంచం తీసుకున్న సదరు అధికారులను విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.


హిందీ డబ్బింగ్ సెన్సార్‌ షిప్ విషయంలో కీలక మార్పులు   


ఓవైపు లంచం ఆరోపణల కేసు విచారణ కొనసాగిస్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ‌ చిత్రాల హిందీ డబ్బింగ్ సెన్సార్‌ సర్టిఫికేట్‌లను పొందే ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.  గతంలో హిందీలో విడుదల చేయాలనుకునే సినిమాలకు కేవలం ముంబై నుంచే సెన్సార్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు స్థానిక సెన్సార్ బోర్డుల నుంచే సెన్సార్ సర్టిఫికేట్లను పొందవచ్చని వెల్లడించింది.  తమిళ సినిమాల హిందీ సెన్సార్‌షిప్‌ను ఇకపై చెన్నైలోనే తీసుకోవచ్చని కేంద్ర ప్రకటించింది. తెలుగు సినిమాల హిందీ సెన్సార్ సర్టిఫికేట్లను హైదరాబాద్ నుంచే పొందవచ్చని వెల్లడించింది. ఈ నిర్ణయంతో చిత్ర నిర్మాతలు ఇకపై ముంబైకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.  


స్థానిక సెన్సార్ బోర్డులలోనే హిందీ డబ్బింగ్ సెన్సార్ షిప్


వాస్తవానికి చెన్నైలోని తమిళ CBFC ప్రస్తుతం  తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలకు సెన్సార్ సర్టిఫికేట్లు ఇస్తుంది. హిందీ డబ్బింగ్ చిత్రాలకు మాత్రం ఇవ్వడం లేదు. హిందీ సెన్సార్ సర్టిఫికేట్ కోసం ముంబైకి వెళ్లాల్సి ఉండేది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇప్పుడు తమిళ చిత్రాల హిందీ సెన్సార్ సర్టిఫికేట్లను కూడా తమిళ CBFC జారీ చేయనుంది. ఈ నిర్ణయం కేవ‌లం త‌మిళ సినిమాలకే కాకుండా తెలుగు, క‌న్న‌డం, మ‌ల‌యాళం స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని తెలిసింది. ఇక‌పై ప్రాంతీయ సినిమాల హిందీ అనువాదాల సెన్సార్ కోసం ముంబైకి వెళ్లాల్సిన ప‌ని లేదని తెలిపింది. చెన్నైలో త‌మిళ సినిమాల‌కు, హైద‌రాబాద్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రాలకు, బెంగ‌ళూరులో క‌న్న‌డ సినిమాలకు సంబంధించిన హిందీ డబ్బింగ్ సెన్సార్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా విశాల్ బయటకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వెల్లడించడంతో మొత్తం సెన్సార్ బోర్డు రూపు రేఖలు మారిపోయాయి.


Read Also: 3 భాగాలుగా ‘మహా భారతం‘- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన నిర్ణయం


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial