తమిళ విలక్షణ నటుడు విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తమిళంలో ‘పిచ్చైక్కరన్’ పేరుతో 2016లో విడుదలైన ఈ మూవీ అక్కడ భారీ విజయం సాధించడంతో ఆ సినిమాను తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాలని అందరూ కోరుకున్నారు. దీనిపై గతంలో అనేక వార్తలు వచ్చాయి కూడా. అయితే తాజాగా ‘బిచ్చగాడు’ సీక్వెల్ గురించి మూవీ హీరో విజయ్ ఆంటోని లేటెస్ట్ అప్డేట్ ఒకటి విడుదల చేశారు. దీంతో ‘బిచ్చగాడు 2’ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ జోరు నడుస్తోంది. ముఖ్యంగా సౌత్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న సినిమాలకు వరుసగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. దీంతో ‘బిచ్చగాడు’ సినిమా సీక్వెల్ పై కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పోస్టర్ పై ఆసక్తి నెలకొంది. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ కళ్లకు ఎరుపు రంగు గుడ్డ కట్టుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. దానిపై యాంటీ బికిలీ అని రాసి ఉంది. ఈ సినిమాను ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు తెలియజేశారు. సినిమాను 2023 వేసవిలో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా విడుదల తేదీను ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుతం విజయ్ ఆంటోని పోస్ట్ తో సినిమాపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: వామ్మో, ప్రాణాలు పోతే? హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ డేరింగ్, సినిమా చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్టంట్!
‘బిచ్చగాడు’ కూడా 2016 వేసవిలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తల్లి ఆరోగ్యం కోసం కొడుకు బిచ్చగాడిగా మారి దీక్ష చేపట్టే కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుండేదని అప్పట్లో టాక్ వచ్చింది. అయితే అది ఇన్నేళ్లకు నెరవేరింది. తమిళంలో ఈ మూవీను ‘పిచ్చైక్కరన్ 2’ గా విడుదల చేయనున్నారు. అలాగే తెలుగులో ‘బిచ్చగాడు 2’, కన్నడలో ‘భిక్షుకా 2’, మళయాళంలో ‘భిక్షాక్కరన్ 2’ పేరుతో విడుదల చేయాలని నిర్ణయించింది మూవీ టీమ్. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని మూవీను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ మూవీను ముందు ‘భారం’, ‘మెట్రో’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా తర్వాత కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి రెడీ అయ్యారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్ పై ఆయనే నిర్మాతగా ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు.