Raidurgam Accident News: రాయదుర్గం పోలీస్ స్టేషన్ (Raidurgam Police Station) పరిధిలో దారుణం జరిగింది. ఓ కారుతో యువకుడు బైకర్ ను ఢీకొన్నాడు. అతను కోపంతో ఈ పని చేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల 18నే ఈ ఘటన జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాయదుర్గం పోలీసులు వెల్లడించారు.


ఎర్రగడ్డ నుంచి గచ్చిబౌలికి ద్విచక్ర వాహనంపై సయ్యద్ సైఫుద్దీన్, అతని భార్య మరియా మీర్ వెళ్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై వారి వెంటనే బంధువులైన మరో ఇద్దరు యువకులు కూడా వెళ్తున్నారు. అలా దుర్గం చెరువు తీగల వంతెన వద్దకు రాగానే ఆ యువకుల పక్క నుంచి ఓ బెంజ్ కారు దూసుకెళ్లింది. ఆ క్రమంలో రోడ్డుపై ఉన్న నీరు వాళ్లపై చిందింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తిని యువకులు దూషించారు. అది చూసిన కారులోని వ్యక్తి కోపంతో బైక్ పై వెళ్తున్న వారిని కారుతో ఢీకొన్నాడు. కారు నడిపే వ్యక్తిని రాజా సింహ రెడ్డి అని గుర్తించారు. 


వెనుక బైక్ పై వస్తున్న భార్యా భర్తలు ఇది చూసి ఎందుకు ఢీ కొట్టావ్ అని వాగ్వాదానికి దిగడంతో వారిని కూడా కారుతో ఢీకొన్నాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసి సారీ చెప్పకుండా వెళ్తున్నందుకు బాధితులు కారును వెంబడించగా.. ఈ దంపతుల బైక్ ను గచ్చిబౌలోని అట్రియం మాల్‌ వద్ద నిందితుడు ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై నుంచి దంపతులు ఎగిరి కింద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే యువకులు దంపతులను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈ రోజు (డిసెంబరు 22) మారియా మృతి చెందింది. మృతురాలికి 8 నెలల కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజసింహ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణించిన వ్యక్తి జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొడుకు రాజసింహారెడ్డిగా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


వివరాలు చెప్పిన డీసీపీ శిల్పవల్లి 


ఈ కేసుకు సంబంధించి మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 19వ తేదీన తెల్లవారు జామున ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అటు వైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై మురికి నీరు పడేలా డ్రైవ్ చేశారు. దీంతో బాధితులకి నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం అయ్యి తిరిగి వెళ్తున్న వారిని నిందితుడు కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ట్రీట్ మెంట్ చేస్తుండగా నిన్న బాధితురాలు మృతి చెందారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశాం. నిందితుడిపై ఐపీసీ 302, 307 కింద కేసు నమోదు చేశాం’’ అని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు చెప్పారు.