దర్శకుడు మురుగదాస్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నారు. సుమారు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నారు. రజనీకాంత్ తో ‘దర్బార్‌‘ తర్వాత మురుగదాస్‌ ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష హీరోయిన్ గా చేసిన ‘రాంకీ‘ చిత్రానికి కథను అందించారు. మళ్లీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారా అని ఆలోచిస్తున్న సమయంలో, నటుడు శివ కార్తికేయన్‌ తో కలిసి మురుగదాస్ ఓ సినిమా చేబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను లైట్‌ హౌస్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, శివకార్తికేయన్ ప్రస్తుతం ‘అయిలాన్‌‘ చిత్రాన్ని పూరి చేసి ‘మావీరన్‌‘ అనే సినిమాలో నటిస్తున్నారు. 


‘దర్బార్’ దెబ్బతో సినిమాలకు లాంగ్ గ్యాప్


2020లో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి మురుగదాస్ ‘దర్బార్‘ అనే సినిమా చేశారు.  ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అనుకోని పరాజయంతో, మురుగదాస్ తన కెరీర్ లోనే లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. వాస్తవానికి విజయ్ తో  ఓసినిమా చేయాలి అనుకున్నా ఆ ప్రాజెక్ట్ ఓకే కాలేదు. ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టులు చేయాలనుకున్న సాధ్యం కాలేదు. తాజాగా తమిళ యువ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.


దిగ్గజ దర్శకులలో మురుగదాస్ ఒకరు


దేశంలోని దిగ్గజ దర్శకుల్లో మురుగదాస్ కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను కలిసి సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. తన కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ‘దీనా’, ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’ లాంటి సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. సూర్యతో ‘గజిని’ మూవీని చేసిన మురుగదాస్, అదే సినిమాను హిందీలో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు. దళపతి విజయ్ తో ‘తుపాకి’ చిత్రాన్ని తీసి మళ్ళీ అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’గా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత మురుగదాస్ వరుసగా పరాజయాలు చవిచూశారు. ‘దర్బార్’ డిజాస్టర్ తో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. శివ కార్తికేయన్ మూవీతోనైనా మురుగదాస్ మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆయన అభిమానులు అశిస్తున్నారు. పరాజయాల నుంచి బయటపడేందుకు సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, మున్ముందు మరిన్ని బ్లాక్ బస్టర్స్  సాధించాలని కోరుకుంటున్నారు.






Read Also: ‘జైలర్’ రిలీజ్ వాయిదా, ‘పొన్నియన్ సెల్వన్-2’ కోసమేనా?