సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ‘జైలర్’ విడుదల వాయిదా పడింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా సమ్మర్ లో విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం ఈ సినిమా విడుదలను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. విడుదల తేదీ ఏప్రిల్ 14 నుంచి ఆగస్టు 11కు మారినట్లు తెలుస్తోంది.


‘జైలర్‘ రిలీజ్ వాయిదాకు కారణం ఇదేనా?


‘జైలర్’ సినిమా విడుదల వాయిదాకు గల కారణం ‘పొన్నియిన్ సెల్వన్-2’ అనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక సినిమా రెండో భాగం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య క్లాష్ ఉండకూడదని ‘జైలర్’ టీమ్ భావిస్తోందట. అందులో భాగంగానే స్నేహపూర్వక ధోరణిలో ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నా మరుసటి నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.  


సరికొత్తగా కనిపించబోతున్న రజనీకాంత్


సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జైలర్’ షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ఈ సినిమాపై రజనీ అభిమానులు బాగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ‘జైలర్’ సినిమా కథ మొత్తం ఒకే రాత్రలో ఉంటుందట. డే టైమ్ షాట్స్ తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అవి కూడా కొద్ది నిమిషాల పాటే ఉంటాయట. సాధారణ కమర్షియల్ ఫార్మాట్ కు పూర్తి భిన్నంగా థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ కుమార్ తో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.


‘పొన్నియిన్ సెల్వన్-2’ అన్ని భాషల్లో హిట్ కొట్టేనా?


ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన  ‘పొన్నియిన్ సెల్వన్-1’ మంచి విజయాన్ని అందుకుంది. గతేడాది సెప్టెంబర్ 30న పలు భాషల్లో ఈ సినిమా విడుదలైంది.  విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించారు. అయితే, తమిళంలో మినహా ఇతర సినిమా పరిశ్రమల్లో ఈ మూవీ పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే ‘పొన్నియిన్ సెల్వన్-2’ ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి భాగం పెద్దగా ఆకట్టుకోకపోయినా రెండో పార్ట్ మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భాగం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 


Read Also: 'బుట్ట బొమ్మ' వాయిదా, ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించిన మేకర్స్