Actor Sarath Babu: టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి గురవడానికి గల కారణాలు ఏంటనేది తెలియలేదు. శరత్ బాబు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ విషయం సినీ నటి కరాటే కళ్యాణి ద్వారా బయటకు వచ్చింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో శరత్ బాబు గురించి ఓ పోస్ట్ చేసింది. తనకు ఇష్టమైన నటుల్లో శరత్ బాబు ఒకరని, అప్పట్లో ఆయన కలల అమ్మాయిల కలల రాకుమారుడు అని పేర్కొంది. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకుందాం శ్రీరామరక్ష అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆయన అభిమానులు శరత్ బాబుకు ఏమైంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


శరత్ బాబు ఆంధ్రప్రదేశ్ ఆముదాలవలసలో జన్మించారు. ఆయన అసలు పేరు  సత్యనారాయణ దీక్షిత్. ఆయన సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత శరత్ బాబు గా పేరు మార్చారు. శరత్ బాబు 1973 లో విడుదల అయిన ‘రామరాజ్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ‘కన్నెవయసు’ సినిమాలో నటించారు.తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘పంతులమ్మ’, ‘అమెరికా అమ్మాయి’ చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన ‘చిలకమ్మ చెప్పింది’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు శరత్ బాబు. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారాయన. దాదాపు 220 కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు శరత్ బాబు. ఇప్పటికీ ఆయన అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించారు శరత్ బాబు. 


అంతే కాదు ఆయన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పలు పురస్కారాలను కూడా అందుకున్నారు. ఆయన నటనకు గానూ 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి ‘సీతాకోక చిలుక’ సినిమాకు అవార్డును అందుకున్నారు. తర్వాత ‘ఓ భార్య కథ’,  ‘నీరాజనం’ సినిమాలకు గానూ ఆయనకు అవార్డులు అందాయి.  


శరత్ బాబు సినిమా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఆయన అప్పటికే నటిగా మంచి పేరు తెచ్చుకున్న తెలుగు సీనియర్ నటి రమాప్రభను వివాహం  చేసుకున్నారు. అయితే వీరి కాపురం కొన్నేళ్లు బాగానే సాగినా తర్వాత మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. రమాప్రభ శరత్ బాబు కంటే నాలుగేళ్లు వయసులో పెద్ద ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. ప్రస్తుతం ఆయనకు ఏడుపదుల వయసు దాటింది. దీంతో ఇంటి వద్దే ఉంటున్నారు. అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చెన్నై బయలుదేరి వెళ్తున్నారని సమాచారం. అలాగే ఆయన అభిమానులు కూడా ఆయన ఏం జరిగింది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాాలని ప్రార్ధిస్తున్నారు. 



Read Also: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!