విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి ఉత్సవాలు హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ వేడుకకు హాజరు అయ్యారు. ఎన్టీ రామారావుతో తనకు ఉన్న పరిచయాన్ని, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వేదికపై గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమాకు గర్వకారణమైన ఎన్టీఆర్ 100వ జన్మదిన వేడుకలకు హాజరు కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తెలుగు సినిమాకు గర్వకారణమైన ఎన్టీఆర్ 100వ జన్మదిన వేడుకలకు హాజరు కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నేను ఆ మహనీయుడి నుంచి నేర్చుకున్న విషయాలలో కీలకమైనది ‘ఐక్యమత్యమే మహాబలం’. ఆయన ఈ కలను సజీవంగా ఉంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం” అంటూ పిలుపునిచ్చారు.
తెలుగు జాతి గొప్పతనాన్ని చాటారు!
ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాళ్లో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ''ఇప్పుడు విదేశాల్లో మన తెలుగు సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. సౌత్ ఇండియన్ సినిమా బావుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారు మన పవర్ ఏంటో చూపించారు. ఆయన్ను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. గుర్తు చేసుకుంటూనే ఉండాలి'' అన్నారు. “రాముడి గురించో, కృష్ణుడి గురించో మాట్లాడటం కంటే... మనం వారి గురించి మనసుల్లో ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటిని ఎక్కువ అనుభూతి చెందాలే తప్ప మాట్లాడకూడదు. వాళ్ల విజయాలను, అటువంటి మహనీయులు వేసిన మార్గాలను గుర్తు చేసుకుంటూ... ఆ మార్గాల్లో నడుస్తుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. నాతో సహా ప్రతి రోజూ సినిమా సెట్, షూటింగుకు వెళ్లే ప్రతి ఆర్టిస్ట్ ఆయన పేరుని గుర్తుకు తెచ్చుకోకుండా ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి? అని మన పొరుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో చాటి చెప్పిన లెజెండ్ ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తి పని చేసిన చిత్ర పరిశ్రమలో మేం అందరం పని చేస్తున్నామంటే అంత కంటే గర్వకారణం ఇంకేముంది!?'' అన్నారు.
ఎన్టీఆర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం జీవితాంతం మరచిపోలేను
చిన్నతనంలో ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి కలిశానని రామ్ చరణ్ తెలిపారు. ''నేను, పురంధరరేశ్వరి గారి అబ్బాయి రితేష్ స్కేటింగ్ క్లాసులకు వెళ్లే వాళ్లం. ఓ రోజు నేను, రితేష్ స్కేటింగ్ చేసుకుంటూ, వాళ్ళ ఇంటి నుంచి కిందకు వెళితే రామారావు గారి ఇల్లు వచ్చింది. అప్పుడు ఉదయం ఆరున్నర అవుతుంది. ఆయన అప్పటికే రెడీ అయి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. అందరికీ తెలిసినట్లే చికెన్ పెట్టుకుని తింటున్నారు. నన్ను చూసి, నాకు కూడా టిఫిన్ పెట్టారు. అది నాకు కలిగిన అదృష్టం. ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఆ క్షణాలను జీవితాంతం మరచిపోలేను'' అని రామ్ చరణ్ తెలిపారు.
Read Also: రానాకు కల్లు దావత్ ఇచ్చిన గంగవ్వ, నిషాలో నిజం చెప్పి ‘పరేషాన్’ చేసిన బళ్లాల దేవుడు!