Prabhas: ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాల్లో ‘కల్కి 2898 ఏడీ’ కూడా ఒకటి. ఈ మూవీకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మొన్నటి వరకూ ‘ప్రాజెక్ట్ కె’ గా పిలుచుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ మూవీకు అమెరికా డల్లాస్ లో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్ లో ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ ఖరారు చేస్తూ అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, రానా, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ ఆన్ లైన్ కాల్ ద్వారా పాల్గొన్నారు. అయితే దీపికా పదుకోణ్ మాత్రం ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో దీపికా పదుకోణ్ గురించి మాట్లాడారు. దీపికా గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


నటిగా దీపికాను ఎంతో ఇష్టపడతాను: ప్రభాస్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఓ ఇంర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ గురించి పలు విషయాలను పంచుకున్నారు. అనంతరం కోస్టార్ దీపికా గురించి మాట్లాడారు. దీపికా పెద్ద సూపర్ స్టార్ అని వ్యాఖ్యానించారు. తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు ప్రభాస్. అలాగే ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్స్ కు యాడ్స్ చేసింది, అంబాసిడర్ గా కూడా ఉందన్నారు. అలాంటి గొప్ప నటితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ సినిమా ద్వారా అది జరిగిందని చెప్పారు. దీపికా సెట్స్ లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుందని, ఆమె సెట్స్ కు రాగానే అందరిలో ఉత్సాహం వస్తుందన్నారు. అందుకే దీపికాను నటి తాను ఎంతో ఇష్టపడతానని చెప్పుకొచ్చారు ప్రభాస్. దీపికా గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. 


సరికొత్త కథ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’..


దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ సుమారు రూ.600 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన గ్లింప్స్ వీడియో రికార్డులు సృష్టించింది. ఈ గ్లింప్స్ వీడియో తర్వాత మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టైటిల్ లోనే ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అని తెలుస్తుంది. వివిధ యుగాల్లో దుష్ట‌శిక్ష‌ణ కోసం శ్రీ మ‌హా విష్ణువు అనేక‌ అవతారాలు ఎత్తుతాడని, అందులో భాగంగానే కలియుగం అంతంలో కల్కిగా అవతారంగా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కిందని తెలుస్తోంది. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినపుడు ప్రభాస్ ప్రపంచాన్ని కాపాడే ఆశాకిరణం కల్కి లా వస్తాడని గ్లింప్స్ వీడియోలో చూపించారు. ప్రపంచాన్ని జ‌యించ‌డానికి ఆధునిక ఆయుధాల‌ను సంపాదించుకోవాల‌ని దుష్ట‌శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తుంటాయి. వారిని క‌ల్కి ఎలా అడ్డుకుంటున్నాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ అని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఆంగ్లంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: టాలీవుడ్‌లో సరికొత్త ప్రయత్నం - వీడియో సాంగ్‌తో అదరగొట్టిన అనుపమా పరమేశ్వరన్ 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial