టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో ముందుకెళ్తున్నారు హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ మొదట్లో మంచి హిట్లు తెచ్చుకున్నా తర్వాత మధ్యలో కథల ఎంపిక విషయంలో కాస్త తడబడ్డారు. అయితే తర్వాత వరుసగా హిట్ లతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘కార్తికేయ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన రీసెంట్ గా నటించిన ‘18 పేజెస్’ సినిమా డిసెంబర్ 23న విడుదల అయింది. ఈ మూవీ విడుదల సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో సందడి చేసింది. క్రిస్మస్ వీకెండ్ కావడంతో హీరో నిఖిల్ శాంతా క్లాజ్ వేషధారణలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 


‘18 పేజెస్’ సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 22న మూవీ టీమ్ హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ మాల్ లో స్పెషల్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ సీక్రెట్ శాంతా డ్రెస్ లో కనిపించారు. శాంతా క్లాజ్ వేషధారణలో ఉన్న టీమ్ తో కలసి మాల్ లో సందడి చేశారు. చిన్నారులకు గిప్ట్ లను అందజేశారు. అలాగే కొంత మందికి ప్రీమియర్ షోకు ఉచితంగా టికెట్లను అందజేశారు. నిఖిల్ ను చూసి అక్కడి పబ్లిక్ సర్పైజ్ అయ్యారు. ఆయన్ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ తో మాల్ మొత్తం నిండిపోయింది. చాలా మంది అభిమానులు నిఖిల్ తో సెల్ఫీలు తీసుకున్నారు. కాగా తన సినిమా కోసం నిఖిల్ భారీగానే ప్రమోషన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టూర్స్ ఈవెంట్ లు చేసి మరీ ప్రచారం చేసింది మూవీ టీమ్. 






మరో వైపు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ మూవీపై ముందు నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నైజాంలో 135, సీడెడ్‌లో 65, ఆంధ్రాలో 185 మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 385 నుంచి 400 థియేటర్లలో విడుదల చేశారు. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 60, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సుమారు 850 థియేటర్లలో విడుదల అవుతుంది. నిఖిల్ గత సినిమాలతో పోలిస్తే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అనే చెప్పొచ్చు.






ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. గతంలో వీరిద్దరూ ‘కార్తికేయ 2’ లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలో నటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. గోపీ సుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటి వరకూ వస్తున్న సమాచారం ప్రకారం మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఓపెనింగ్స్ బాగున్నా.. సినిమా క్లీన్ హిట్ అవునా కాదా అనేది తెలియాలంటే ఓ నాలుగు రోజులు ఆగాల్సిందే.


Also Read: ధమాకా రివ్యూ - 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?