మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మోహన్ లాల్‌కు నోటీసులు పంపించారు. వచ్చే వారం కొచ్చి ఈడీ ఆఫీస్ లో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
ప్రజలను రూ.10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై మాన్సన్ ను గతేడాది సెప్టెంబర్ లో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ పలుమార్లు వెళ్లినట్లు సమాచారం. అసలు ఆయన ఎందుకు వెళ్లారనే విషయంపై క్లారిటీ లేదు. కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు జనాలను మోసం చేశాడు.
అతడి దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పడం అబద్ధమని పోలీసులు తెలిపారు. ఇలాంటి కేసులో మోహన్ లాల్ పేరు వినిపించడం మాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో 'బ్రో డాడీ', 'ఆరట్టు' వంటి సినిమాలతో అలరించారు. ప్రస్తుతం ఆయన చేతుల్లో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. అందులో 'లూసిఫర్-2' ఒకటి.